Updated : 07 May 2021 10:05 IST

Corona: పడకలు దొరికితే మరణాలు తగ్గుదల

30% రోగులు క్షేమంగా ఇంటికి..

ఈనాడు, అమరావతి: ఆసుపత్రుల్లో సకాలంలో పడక లభించి చికిత్సనందిస్తే ప్రస్తుతం నమోదవుతున్న కరోనా మరణాలను 30శాతం వరకు తగ్గించవచ్చని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆక్సిజన్‌ స్థాయులు 90 శాతం తగ్గిన వారికి వెంటనే పడక అవసరం. ఇంకా తగ్గినట్లయితే వెంటిలేటర్‌ కావాలి. అలాగే వైద్యులు సకాలంలో ఇచ్చే ఇంజెక్షన్లు, మందులూ బాధితుడు కోలుకోవడానికి కీలకమవుతున్నాయి. ప్రస్తుతం వంద మంది మరణిస్తే.. వీరిలో 50ఏళ్ల లోపున్న వారు, ఆపై వయసున్నవారు సగం చొప్పున ఉంటున్నారు. బాధితులు వంద మందిలో ఐదుగురు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. వీరిలో ఇద్దరు ముగ్గురు కన్నుమూస్తున్నారు.

తొలగని ఆక్సిజన్‌ బాధలు

శ్వాస పీల్చుకోవడంలో సమస్యలేర్పడి ఆక్సిజన్‌ కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నప్పుడే చాలామంది ప్రాణాలు విడుస్తున్నారు. ఆక్సిజన్‌ కోసం ఆసుపత్రుల వద్ద బాధితులు, కుటుంబీకుల హాహాకారాలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఆసుపత్రుల చుట్టూ ప్రదక్షిణలతోనే కాలహరణమవుతోంది. అంబులెన్సుల్లో గంటల తరబడి నిరీక్షించినా నిష్ప్రయోజనమవుతోంది. కొందరు శ్వాస పీల్చుకునే సదుపాయం అందక ఆసుపత్రి ఆవరణలోనే నేలపై కన్నుమూస్తున్నారు.

ఊహకందని ప్రమాదాలు

అతికష్టంపై ఆక్సిజన్, వెంటిలేటర్‌ను సాధించి వారం, పది రోజులపాటు చికిత్స పొందుతున్నా చాలామంది కోలుకోవడం లేదు. ఊపిరితిత్తులు బాగా దెబ్బతినడంతో ప్రాణాలు నిలవడం లేదని వైద్యుడొకరు తెలిపారు. గుంటూరులో ఒకరు సాధారణ లక్షణాలతో ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో చేరారు. ఆయనకు చికిత్స అందేలోగానే అప్పటివరకు ఆరోగ్యంగా కనిపించిన ఆయన భార్య కన్నుమూశారు. ఇలాంటి దృశ్యాలు రాష్ట్రవ్యాప్తంగానూ కనిపిస్తున్నాయి. గతేడాది వైరస్‌ సోకిన వారు ఆసుపత్రుల్లో చేరి నాలుగైదు రోజులపాటు చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఉత్పరివర్తనం చెందిన వైరస్‌ వ్యాప్తి అంతుబట్టడం లేదు. 

ఒకే కుటుంబంలో రోజుల వ్యవధిలోనే ఇద్దరు, ముగ్గురు చనిపోతున్నారు. కుటుంబంలో ఒకరికి నిర్ధారణయ్యాక కూడా అందరూ ఒకచోట ఉంటున్నారు. దీని వల్ల వైరస్‌ తీవ్రత బలపడుతోంది.

విజయవాడ జీజీహెచ్‌

వైరస్‌ ముక్కు లేదా నోటి నుంచి గొంతు ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరి నష్టపరుస్తోంది. కొందరిలో న్యూమోనియాకు దారితీస్తోంది. ఆస్తమా, గుండెజబ్బులాంటి దీర్ఘకాలిక రోగుల్లో సమస్య మరింత తీవ్రమవుతోంది. వెంటనే వైద్యుడి సలహాలను తీసుకోవాలి.ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం- డాక్టర్‌ గోపీచంద్, పల్మనాలజిస్ట్, 


శాతాలను చూస్తే
రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు, ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారు, మరణించేవారి శాతాన్ని చూస్తే పరిస్థితి అదుపులోనే ఉంది. ఆసుపత్రికి వచ్చిన వెంటనే మరణించేవారూ ఉంటున్నారు. వారు రోగ లక్షణాలతో ఇంట్లోనే ఉన్న రోజులనూ మనం పరిగణనలోకి తీసుకోవాలి.- డాక్టర్‌ సుధాకర్, జనరల్‌ ఫిజీషియన్, రాష్ట్ర కొవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం సభ్యుడు

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని