
Deltavirus: మార్చి నుంచే ఉద్ధృతి
దిల్లీ: దేశ ఉత్తరాదిలో ‘బి.1.617.2’ (డెల్టా వైరస్)రకం కరోనా వైరస్ కారణంగానే రెండో ఉద్ధృతి పెరిగినట్లు మెడికల్ జర్నల్ ‘మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీ’లో ప్రచురితమైన పరిశోధన పత్రం వెల్లడించింది. ఫిబ్రవరిలో ‘బి.1.1.7’ రకం వైరస్ ప్రాంతీయంగా అక్కడక్కడా ప్రబలినప్పటికీ వైద్య ఆరోగ్య వ్యవస్థపై అనుకున్న స్థాయిలో భారం పెరగలేదని పేర్కొంది. మార్చి తర్వాత ‘బి.1.617’ రకం వైరస్‌కు దాని ఉపజాతి ‘బి.1.617.2’ రకం తోడవడంతో కేసులు భారీగా పెరిగినట్లు వివరించింది. ఇది బాగా ప్రబలడంతో.. దీని ఉద్ధృతిలో బి.1.1.7, బి.1.617 రకాలు కనుమరుగైనట్లు తెలిపింది. మరణాల రేటు పెరగకపోయినా ఈ రకం వైరస్ కారణంగా సంక్రమణ వేగం బి.1.1.7 రకంతో పోలిస్తే 50% పెరిగినట్లు వెల్లడించింది. భారత్, యూకేల్లో సేకరించిన డేటాను బట్టి బి.1.1.7 రకం వైరస్ కంటే ‘బి.1.617.2’లో వైరల్ లోడ్ చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. దానివల్ల వ్యాక్సిన్ వేయించుకున్నవారిలోనూ కేసులు పెరిగినట్లు పేర్కొంది. ఈ అధ్యయనాన్ని బట్టి బి.1.617.2 రకం వైరస్‌కు వ్యాక్సినేషన్ చేయించుకున్నవారిలోనూ వేగంగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని తేలినట్లు తెలిపింది. అందువల్ల దీన్ని అడ్డుకట్ట వేయడానికి పాక్షిక వ్యాక్సినేషన్ సరిపోదని, బలమైన ఆరోగ్య వ్యవస్థ ద్వారానే ఈ రకం వైరస్‌ను అరికట్టడం సాధ్యమవుతుందని ఈ పరిశోధన పత్రం పేర్కొంది.