Drugs: తూర్పు ఆసియా వయా హైదరాబాద్‌

మత్తుమందుల రవాణాదారులు హైదరాబాద్‌ను కీలక స్థావరంగా వినియోగించుకుంటున్నారా?

Published : 27 Jun 2021 12:10 IST

మత్తు మందుల రవాణాకు కీలక స్థావరంగా రాజధాని 
కూపీ లాగే పనిలో దర్యాప్తు సంస్థలు  

ఈనాడు, హైదరాబాద్‌: మత్తుమందుల రవాణాదారులు హైదరాబాద్‌ను కీలక స్థావరంగా వినియోగించుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నారు దర్యాప్తు సంస్థల అధికారులు. కేవలం మూడు వారాల వ్యవధిలోనే డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు రూ.97.5 కోట్ల విలువైన హెరాయిన్‌ను పట్టుకోగా, ఇదే సమయంలో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) అధికారులు ఏకంగా రెండువేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మత్తుమందులేవీ స్థానిక వినియోగానికి కాదని, హైదరాబాద్‌ మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్నవేనని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
దీన్నిబట్టి పక్కరాష్ట్రాల్లో సాగవుతున్న గంజాయి ఇతర రాష్ట్రాలకు, అటునుంచి ఇతర దేశాలకు.. ఖరీదైన మత్తుమందులు ఒక దేశం నుంచి మరో దేశానికి హైదరాబాద్‌ మీదుగానే రవాణా అవుతున్నాయనే అనుమానాలు బలపడుతున్నాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.

తూర్పు ఆసియా దేశాల్లో మత్తుమందుల వాడకం చాలా ఎక్కువ. అందుకే అక్కడున్న విమానాశ్రయాల్లో నిఘా కూడా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆఫ్రికా దేశాల నుంచి వచ్చేవారిని మరింత క్షుణ్ణంగా పరీక్షిస్తారు. అందుకే సరాసరి ఆఫ్రికా నుంచి కాకుండా భారత్‌ మీదుగా తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తున్నారని దర్యాప్తు సంస్థలు నమ్ముతున్నాయి. ఇందుకు ప్రధానంగా దిల్లీ, హైదరాబాద్‌లను వినియోగించుకుంటున్నారనే ఆధారాలనూ సేకరించాయి. ఈ రెండు చోట్లా ఈ నెలలో దక్షిణాఫ్రికా నుంచి సరఫరా అయిన హెరాయిన్‌ను పెద్దమొత్తంలో పట్టుకోవడమే దీనికి నిదర్శనమని భావిస్తున్నాయి. ‘‘అంతర్జాతీయ విమానాల రాకపోకలు ఉండటం, ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో సులభంగా తమిళనాడుకు వెళ్లేందుకు వీలుండటం తదితర కారణాలతో హైదరాబాద్‌కు స్మగ్లర్లు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. ఒక్కసారి క్షేమంగా ఇక్కడకు చేరుకుంటే మరో ముఠా సరకు తీసుకొని రోడ్డుమార్గంలో తమిళనాడు, అక్కడ నుంచి పడవల్లో శ్రీలంకకు చేరుస్తుంది. అక్కణ్నుంచి అంతర్జాతీయ ముఠాలు సరకును తూర్పు ఆసియా దేశాలకు చేరుస్తాయనే అనుమానాలున్నాయి. మత్తుమందులు పట్టుబడుతున్న ఉదంతాలు పెరగడంతో తీవ్రతను గుర్తించిన దర్యాప్తు సంస్థలు దీని వెనుక ఎవరున్నారో తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం వివిధ దర్యాప్తు సంస్థలన్నీ చేతులు కలిపాయి’ అని ఓ అధికారి తెలిపారు.

గంజాయి కూడా.. 

గంజాయి రవాణాకు కూడా హైదరాబాద్‌ కేంద్రస్థానంగా మారింది. దేశం మొత్తంలో అత్యధికంగా గంజాయి సాగవుతున్న ప్రాంతాల్లో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ఉంది. అక్కడ సాగయ్యే గంజాయి ఇతర దేశాలకూ ఎగుమతి అవుతోంది. ఇదంతా ఎక్కువగా హైదరాబాద్‌ మీదుగానే జరుగుతోంది. ఒడిశా సరిహద్దుల నుంచి రకరకాల పద్ధతుల్లో తొలుత హైదరాబాద్‌ తీసుకొచ్చి.. అదును చూసుకుని ముంబయికి, అక్కడ నుంచి ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. డీఆర్‌ఐ, ఎన్‌సీబీ అధికారులే 2020 జనవరి నుంచి ఇప్పటి వరకూ దాదాపు పదివేల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక ఆబ్కారీశాఖతోపాటు పోలీసులు స్వాధీనం చేసుకున్నది అదనం. ఈ నేపథ్యంలో విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై దర్యాప్తు సంస్థలు ఎక్కువ నిఘా పెట్టాయి. అనుమానాస్పద వాహనాలను వెంటాడి పట్టుకుంటున్నాయి. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని