TS News: ధరణి ధగధగ!

వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవల పోర్టల్‌ ధరణి ధగధగా మెరుస్తోంది.

Published : 29 Jun 2021 09:18 IST

ఏడున్నర నెలల్లో రూ.565 కోట్ల ఆదాయం

పోర్టల్‌ ద్వారా 5.59 లక్షల లావాదేవీలు

లాక్‌డౌన్‌ అనంతరం పుంజుకున్న సేవలు 

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవల పోర్టల్‌ ధరణి ధగధగా మెరుస్తోంది. ఏడున్నర నెలల్లో 5.59 లక్షల వివిధ రకాల సేవలను ప్రజలకు అందించింది. ప్రభుత్వానికి రూ.565 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది. ఈ సేవలను 3.93 లక్షల మంది రైతులు సగటున మూడు నిమిషాల నుంచి ముప్పావుగంట కాలంలోనే పొందారు. గతేడాది నవంబరు 2న తేదీన ప్రారంభమైన పోర్టల్‌పై గతనెల చివరి వారంలో లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. ఈనెల నుంచి సేవలు ప్రారంభమైనా పదో తేదీ నుంచి లావాదేవీలు పుంజుకున్నాయి. ప్రస్తుతం రోజుకు 2500 లావాదేవీలు జరుగుతున్నాయి. పోర్టల్‌ ద్వారా విక్రయం, బహుమతి, భాగ పంపిణీ, వారసత్వ బదిలీ, తనఖా, మ్యుటేషన్, వ్యవసాయేతర భూమిగా మార్పిడి తదితర సేవలను అందిస్తున్నారు. వివిధ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు, వాటికి సంబంధించిన సేవలు పొందేందుకు 19 మాడ్యూళ్లు పోర్టల్‌లో ఏర్పాటు చేశారు.

సులువుగా నాలా సేవలు 

వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు వినియోగించుకునేందుకు పొందాల్సిన నాలా (ఎన్‌ఏఎల్‌ఏ) అనుమతులు ధరణి పోర్టల్‌ అమలులోకి వచ్చాక సులువుగా మారాయి. ఆన్‌లైన్‌లో స్లాటు నమోదైందంటే చాలు తహసీల్దారు- సంయుక్త సబ్‌ రిజిస్ట్రారు అనుమతి ఇచ్చేస్తున్నారు. ఏడున్నర నెలల్లో 15449 నాలా అనుమతులు జారీ అయ్యాయి. సగటున రెండు నిమిషాల నుంచి అరగంట వ్యవధిలో అనుమతులు జారీ అవుతున్నాయి. వ్యవసాయ భూములను తమ కుటుంబ సభ్యులకు బహుమతిగా (గిఫ్ట్‌ డీడ్‌) ఇవ్వడం కూడా సులువుగా మారింది. ఈ లావాదేవీ ద్వారా రూ.69 కోట్ల ఆదాయం సమకూరింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని