Vaccine: చైనా టీకా.. చిన్నారులపై భేష్‌

కొవిడ్‌-19 నివారణకు చైనా అభివృద్ధి చేసిన ‘కరోనా వ్యాక్‌’ టీకా.. 3-17 ఏళ్ల వయసు వారికి సురక్షితమని, వారిలో బలమైన యాంటీబాడీ స్పందనను అది కలిగిస్తుందని తాజా అధ్యయనం పేర్కొంది. దీని వివరాలు తాజాగా...

Updated : 30 Jun 2021 07:18 IST

బీజింగ్‌: కొవిడ్‌-19 నివారణకు చైనా అభివృద్ధి చేసిన ‘కరోనా వ్యాక్‌’ టీకా.. 3-17 ఏళ్ల వయసు వారికి సురక్షితమని, వారిలో బలమైన యాంటీబాడీ స్పందనను అది కలిగిస్తుందని తాజా అధ్యయనం పేర్కొంది. దీని వివరాలు తాజాగా ప్రముఖ వైద్య పత్రిక ‘ద లాన్సెట్‌ ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌ జర్నల్‌’లో ప్రచురితమయ్యాయి. సినోవ్యాక్‌ లైఫ్‌ సైన్సెస్‌ సంస్థ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించి మొదటి, రెండో దశల్లో భాగంగా 550 మంది చిన్నారులు, కౌమారప్రాయులపై ప్రయోగాలు నిర్వహించారు. కరోనావ్యాక్‌ రెండు డోసులు పొందినవారిలో 96శాతం మందికి రక్షణ లభించినట్లు తేలింది. వీరిలో కరోనాను నిర్వీర్యం చేసే యాంటీబాడీలు ఉత్పత్తయినట్లు గుర్తించారు.  మొదటి దశ ప్రయోగాల్లో భాగంగా 72 మందికి, రెండో దశలో 480 మందికి టీకా వేశారు. వీరిని రెండు బృందాలుగా విభజించారు. ఒక బృందానికి 1.5 మైక్రోగ్రాములు, మిగతావారికి 3 మైక్రో గ్రాముల సామర్థ్యంతో టీకా డోసులు ఇచ్చారు. మొదటి దశ ప్రయోగాల్లో చిన్నారులందరిలో యాంటీబాడీలు గణనీయంగా ఉత్పత్తి అయ్యాయి. 3 మైక్రోగ్రాములు పొందినవారిలో ఎక్కువగా ఇవి వెలువడ్డాయి. రెండో దశ ప్రయోగాల్లో 1.5 మైక్రోగ్రాములు పొందినవారిలో 97 శాతం మందిలో, 3 మైక్రోగ్రాములు పొందిన అందరిలోనూ యాంటీబాడీలు ఉత్పత్తయ్యాయి. 18 ఏళ్లు పైబడినవారితో పోలిస్తే 3-17 ఏళ్ల వయసువారిలోనే ఎక్కువ రోగనిరోధక స్పందన ఉత్పన్నమవుతున్నట్లు వెల్లడైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని