AP News: సీమ పందుల కోసం సినీ ఫక్కీలో దాడి

జాతీయ రహదారిపై పోలీసులు ఉండగానే సీమ పందుల వ్యాన్‌పై దాడి చేసి

Updated : 02 Jul 2021 10:53 IST

నక్కపల్లి, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై పోలీసులు ఉండగానే సీమ పందుల వ్యాన్‌పై దాడి చేసి వాహనాన్ని ఎత్తుకెళ్లేందుకు సుమారు 100 మంది దుండగులు ప్రయత్నించారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం కాగిత టోల్‌గేట్‌ వద్ద గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. విజయనగరంలోని సీమ పందుల ఉత్పత్తి కేంద్రం నుంచి మున్సిపల్‌ అధికారులు సుమారు 40 విత్తన పందులను తరలిస్తున్నారు. గురువారం సాయంత్రం విజయనగరం-విశాఖ జిల్లాల సరిహద్దులో విజయనగరం నుంచి భారీగా వచ్చిన ఎస్కార్ట్‌ పోలీసులు పందుల వ్యాన్‌ను విశాఖ జిల్లా ఎస్కార్టు సిబ్బందికి అప్పగించారు. ఇది చెన్నై వెళుతుందని, విశాఖ జిల్లా సరిహద్దు వరకు రక్షణగా వెళ్లాలని సూచించారు. అక్కడి నుంచి బయలుదేరిన వ్యాన్‌ కాగిత టోల్‌గేట్‌ వద్దకు రాగానే సుమారు 100 మంది వరకు ద్విచక్ర వాహనాలపై వచ్చి దాడి చేశారు. డ్రైవర్‌ సహా ముగ్గురు వ్యక్తులను కొట్టి బయటకు లాగేశారు. వ్యాన్‌ను విశాఖ వైపు వెనక్కి తిప్పారు.

మిగిలిన వారంతా ద్విచక్ర వాహనాలపై అనుసరించారు. రక్షణగా వచ్చిన పోలీసులు దెబ్బలు తిన్నవారిని వాహనంలో ఎక్కించుకుని పారిపోతున్న వారిని వెంబడించారు. నక్కపల్లి చేనేత కాలనీకి చేరుకోగానే దుండగులు వ్యాన్‌ను ఓ వీధిలో వదిలేసి, తాళాలు తీసుకుని పరారయ్యారు. వెనకే వచ్చిన వారంతా పోలీసులకు చిక్కకుండా సమీప తోటలు, వారసంతలోకి పరుగులు తీశారు. పోలీసులు అక్కడికి చేరుకుని.. కాలనీవాసుల సహకారంతో దుండగులను పట్టుకోవడానికి ప్రయత్నించగా ఎవ్వరూ దొరకలేదు. రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని