కరోనా బాధితులకు ఊబకాయం శాపం కాదు

పురుషులు, శరీర బరువు ఎక్కువగా ఉన్న కొవిడ్‌-19 బాధితులకు మరణం ముప్పు ఎక్కువంటూ

Updated : 04 Jul 2021 11:43 IST

వాషింగ్టన్‌: పురుషులు, శరీర బరువు ఎక్కువగా ఉన్న కొవిడ్‌-19 బాధితులకు మరణం ముప్పు ఎక్కువంటూ జరిగిన విశ్లేషణలను తాజా అధ్యయనం ఖండించింది. దక్షిణాఫ్రికాలోని కేప్‌ టౌన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. 44,305 మందితో సాగిన 58 అధ్యయనాలను విశ్లేషించి, ఈ మేరకు తేల్చారు. ఐసీయూలో చేరిన కొవిడ్‌ బాధితుల్లో పొగతాగేవారికి 40 శాతం, అధిక రక్తపోటు ఉన్నవారికి 54 శాతం, మధుమేహం ఉన్నవారికి 41 శాతం, శ్వాస సంబంధ రుగ్మతలున్నవారికి 75 శాతం మేర మరణం ముప్పు ఎక్కువని వెల్లడైంది. ఈ ముప్పు.. హృద్రోగం లేదా క్యాన్సర్‌ బాధితుల్లో రెట్టింపు స్థాయిలోను, మూత్రపిండాల వ్యాధిగ్రస్థులకు 2.4 రెట్లు ఎక్కువగాను ఉంటుందని వెల్లడైంది. ‘‘ఈ వ్యాధులకు కొవిడ్‌ మరణాలతో ఉన్న సంబంధాన్ని ఈ పరిశోధన ధ్రువీకరిస్తోంది. అయితే మగవారికి, అధిక బరువును కలిగి ఉన్నవారికి మరణం ముప్పు పెరుగుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు’’ అని పరిశోధనకు నాయకత్వం వహించిన బ్రూస్‌ ఎం బికార్డ్‌ చెప్పారు. పొగ తాగడం, శ్వాస సంబంధ సమస్యల వల్ల ఏసీఈ-2 రెసెప్టార్ల వ్యక్తీకరణ పెరుగుతుందని చెప్పారు. మానవ కణంలోకి ప్రవేశించడానికి ఈ రెసెప్టార్‌ను కరోనా వైరస్‌ ఉపయోగించుకుంటుంది.

కంటి చికిత్సకు కొత్త శిలీంధ్ర నాశక విధానం

దిల్లీ: దేశ రాజధానిలోని దిల్లీ ఐఐటీ పరిశోధకులు కంటికి సంబంధించిన ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ నివారణకు సరికొత్తగా పెప్టైడ్‌ (అమినో ఆమ్లాల చైను) ఆధారిత శిలీంధ్ర నాశక విధానాన్ని రూపొందించారు. ఇది శిలీంధ్ర నాశక సాధకమైన ‘నాటామైసిన్‌’ చొరబాటును క్రియాశీలం చేసి ఫంగస్‌పై విస్తృతంగా పోరాడేలా చేస్తుంది. కుసుమా స్కూల్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్‌ అర్చనా చుగ్‌ నేతృత్వంలో దిల్లీ ఐఐటీ మహిళా పరిశోధకుల బృందం ఈ విధానాన్ని రూపొందించటం విశేషం. ప్రయోగశాలలో ఈ మందును జంతువులపై పరీక్షించినపుడు అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఈ సందర్భంగా అర్చనా చుగ్‌ మాట్లాడుతూ.. ఈ పెప్టైడ్స్‌కు పేలవంగా వ్యాపించే నాటామైసిన్‌ జత కలిసినపుడు జనించే శక్తి అద్భుతమైన శిలీంధ్ర నాశకంగా పనిచేస్తుందన్నారు. ‘మేకిన్‌ ఇండియా’కు ఈ పరిశోధన చక్కటి నిదర్శనమని ఆమె అన్నారు. దేశంలోని బయో టెక్నాలజీ, ఫార్మాసూటికల్‌ పరిశ్రమలు ఈ ఔషధం క్లినికల్‌ ట్రయల్స్‌కు ముందుకు వస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఫార్మాసూటిక్స్‌లో వీరి అధ్యయనం ఇటీవల ప్రచురితమైంది.

కొవిడ్‌ చికిత్సకు 200 ఔషధాలు

లండన్‌: కొవిడ్‌-19పై పోరు కోసం శాస్త్రవేత్తలు మానవ మేధస్సుతోపాటు కృత్రిమ మేధస్సు (ఏఐ)నూ వాడుతున్నారు. ఈ ఇన్‌ఫెక్షన్‌కు చికిత్స చేయడానికి ఉపయోగపడే 200 ఔషధాలను ఏఐ సాయంతో బ్రిటన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మహమ్మారికి సమర్థ చికిత్సలను అందుబాటులోకి తీసుకురావడానికి ఇది వీలు కల్పిస్తుందని వారు పేర్కొన్నారు. కరోనా విజృంభణ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఆ వైరస్‌ వల్ల కలిగే నష్టాలను తగ్గించడానికి మార్గాలను శాస్త్రవేత్తలు అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు కంప్యూటేషనల్‌ బయాలజీ, మెషీన్‌ లెర్నింగ్‌ సాధనాల సాయంతో ప్రొటీన్లపై పరిశోధన చేశారు. వీటిలో కరోనా ఇన్‌ఫెక్షన్‌తో ముడిపడిన వాటిని గుర్తించారు. ‘‘ఏఐ సాయంతో ప్రొటీన్‌ నెట్‌వర్క్‌పై పరిశీలన సాగించాం. ఇన్‌ఫెక్షన్‌కు దారితీసే అంశాలను పసిగట్టాం. తద్వారా కొవిడ్‌ చికిత్సకు పనికొచ్చే వీలున్న 200 ఔషధాలను గుర్తించాం’’ అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటికే ఆమోదం పొందిన దాదాపు 2వేల ఔషధాలను విశ్లేషించి, వీటిని గుర్తించారు. వీటిలో 40 మందులు కొవిడ్‌కు పనికొస్తాయని ఇప్పటికే గుర్తించి, వాటిపై క్లినికల్‌ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. తమ ఏఐ సాధనాల సమర్థతకు ఇది నిదర్శనమని కేంబ్రిడ్జ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. ఔషధాలతో లక్ష్యంగా చేసుకోవడానికి అనువుగా ఉన్న కొవిడ్‌ సంబంధ జీవ ప్రక్రియలను గుర్తించడానికీ ఇది వీలు కల్పించిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని