వేలిముద్ర చెరిగిపోదులే.. దొంగెవరో తెలిసిపోయెలే!

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో పనులు క్షణాల్లో పూర్తవుతున్నాయి.

Published : 11 Jul 2021 15:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో పనులు క్షణాల్లో పూర్తవుతున్నాయి. నేరస్థుల గుర్తింపులోనూ ఈ పరిజ్ఞానం కీలకంగా ఉపయోగపడుతోంది. నేరానికి పాల్పడింది పాత నేరస్థుడే అయితే.. ఘటనా స్థలంలో అతడి వేలిముద్రలు దొరికితే.. అ నిందితుడిని గుర్తించడం ఇప్పుడు క్షణాల్లో పనే. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో గురువారం జరిగిన బంగారం దొంగతనం కేసుల్లో నిందితుడిని ఇలా నిమిషాల్లోనే పోలీసులు గుర్తించారు. ఇందుకు పోలీసు శాఖ సమకూర్చుకున్న పాపిలోన్‌ సాఫ్ట్‌వేర్, ఫామ్‌టాప్‌ పరికరాలు దోహదం చేశాయి.

హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధి నయీం నగర్లోని భద్రకాళి అపార్టుమెంట్లో రెండు ఇళ్లలో గురువారం పట్టపగలు చోరీ జరిగింది. ఈ ఇళ్లల్లో ఎవరూ లేని సమయంలో దొంగలు జొరబడి 25 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికే మట్వాడా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనూ ఇదే తరహాలో 10 తులాల బంగారం దొంగతనం జరిగింది. బాధితుల ఫిర్యాదుతో హన్మకొండ, మట్వాడా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రెండు చోట్లా తలుపులు, బంగారం దాచిపెట్టిన బీరువాల వద్ద పోలీసులకు కొన్ని వేలిముద్రలు దొరికాయి. వాటిలో నుంచి ఇంట్లో వారి వేలిముద్రలను వేరు చేసి, అనుమానిత వేలిముద్రలను ఘటనా స్థలం నుంచే హైదరాబాద్‌లోని ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో (ఎఫ్‌.పి.బి.)కి పంపారు. అక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లోని పాత నేరస్థులకు సంబంధించి దాదాపు 6 లక్షల వేలిముద్రల డేటాబేస్‌ ఉంది. వరంగల్‌ ఘటనల్లోని నిందితుడి వేలిముద్రలు.. ఆ డేటాబేస్‌లోని ఓ పాత నేరస్థుడి వేలిముద్రలతో సరిపోయాయి. దీని ఆధారంగా నిందితుడిని హరియాణాకు చెందిన పరమేశ్వర్‌గా గుర్తించారు. 2016లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఇదే తరహాలో దొంగతనాలు చేసి పోలీసులకు చిక్కిన పరమేశ్వర్‌.. ఆ కేసులో జైలు నుంచి బయటకు వచ్చి ఇప్పుడు వరంగల్‌లో చోరీలకు పాల్పడినట్లు గుర్తించారు. ప్రస్తుతం పరమేశ్వర్‌ కోసం పోలీసులు వెతుకుతున్నారు. 

సత్వరం పట్టుకోవడానికి అవకాశం

ఘటనా స్థలాల్లో దొరికే వేలిముద్రలను విశ్లేషించేందుకు గతంలో రోజులకొద్దీ సమయం పట్టేది. ఆయా వేలిముద్రలను ఫొటో తీసి, హైదరాబాద్‌లోని డేటాబేస్‌కు పంపి.. ఒక్కో వేలిముద్రతో సరిపోల్చేవారు. ఇదంతా పూర్తికావడానికి మూడు నాలుగు రోజులు పట్టేది. ఈలోపు నిందితుడు రాష్ట్రాలు దాటి పారిపోవడానికి ఆస్కారం ఉండేది. ప్రస్తుతం ఘటనా స్థలంలో సేకరిస్తున్న వేలిముద్రలను పామ్‌టాప్‌ సాయంతో అక్కడి నుంచే హైదరాబాద్‌లోని డేటాబేస్‌కు పంపుతున్నారు. అక్కడి పాపిలోన్‌ సాఫ్ట్‌వేర్‌.. అనుమానిత వేలిముద్రలను డేటాబేస్‌లోని లక్షల వేలిముద్రలతో క్షణాల్లో పోలుస్తుంది. నిందితుడు పాత నేరస్థుడే అయితే తక్షణం అతడి ఫొటో, చిరునామా పామ్‌టాప్‌లో కనిపిస్తుంది. దీంతో నిందితుడు ఎక్కువ దూరం పారిపోకముందే పట్టుకోవడానికి పోలీసులకు అవకాశం కలుగుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని