AP News: ‘ఛార్జిషీట్ల లెక్కలో మీరే గొప్ప’

తనకు క్యారెక్టర్‌ లేదని, ముఖ్యమంత్రి మాట్లాడేంత స్థాయి లేదని ఎంపీ విజయసాయిరెడ్డి తనపై వ్యాఖ్యలు

Published : 16 Jul 2021 09:54 IST

విజయసాయిరెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు

ఈనాడు, దిల్లీ: తనకు క్యారెక్టర్‌ లేదని, ముఖ్యమంత్రి మాట్లాడేంత స్థాయి లేదని ఎంపీ విజయసాయిరెడ్డి తనపై వ్యాఖ్యలు చేశారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. దిల్లీలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. తాను కేవలం 24 గంటలే జైల్లో ఉన్నానని, బాగా స్థాయి ఎక్కువగా ఉన్న వ్యక్తి 16 నెలలు, కొద్దిగా స్థాయి తక్కువ ఉన్న మరొకరు 14 నెలలు జైల్లో ఉండి వచ్చారని ఎద్దేవా చేశారు. ఒకరికి 17, మరొకరికి 18 ఛార్జిషీట్లు ఉన్నాయని, తాను అంత గొప్పోణ్ని కాదన్నారు.  దొంగ లెక్కలు వేయడంలో ఆయన ఘనాపాఠి అని అంతా మెచ్చుకుంటున్నారని, అదే గొప్ప క్యారెక్టర్‌ అయితే తనది అలాంటి క్యారెక్టర్‌ కాదన్నారు. మెడలు వంచుతానని కాళ్లు పట్టుకోవడం, ఒకటి చెప్పి మరొకటి చేయడం తనకు చేతకాదన్నారు. నరకాసురుడు, హిట్లర్‌ బతికుంటే వాళ్లే సిగ్గుతో తలదించుకునేలా కొందరి పాలన ఉందని విమర్శించారు. ముఖ్యమంత్రి చుట్టూ ఎందరో శకునిలు ఉన్నారని ఆరోపించారు. మరమ్మతుల పేరుతో తమిళనాడులోని తన గ్యాస్‌ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాన్ని మూడు గంటలు ఆపుతామంటూ ఆపివేయించారని రఘురామకృష్ణరాజు తెలిపారు. 16 రోజులు గడిచినా ఆ మూడు గంటలు పూర్తవడం లేదన్నారు. ఇక్కడి సీఎం అక్కడ ముఖ్యమంత్రితో మాట్లాడారని తెలుస్తోందన్నారు. అక్కడ సీఎం కార్యాలయ అధికారులు.. మీ ముఖ్యమంత్రిని కలవమని నాపై ఎందుకు ఒత్తిడి తెస్తున్నారో తనకు అర్ధం కావడం లేదన్నారు. జులై 26 వరకు వేచి చూడాలని, ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు ఎంపీ చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని