TS News: ఆర్టీసీ నష్టాల దారి.. ఎవరు జవాబుదారీ?

తెలంగాణ ఆర్టీసీ నష్టాలతో కుదేలవుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గతంలో ఎప్పుడూ లేనంతగా రూ.2,329 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది

Published : 20 Jul 2021 13:51 IST

చరిత్రలోనే అత్యధికంగా రూ. 2,329 కోట్ల నష్టం 

కారణాల విశ్లేషణ అవసరం

ఈనాడు - హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ నష్టాలతో కుదేలవుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో గతంలో ఎప్పుడూ లేనంతగా రూ.2,329 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఈ ఏడాదిలో రోజువారీ నష్టం రూ.6.38 కోట్లు నమోదైంది. ఏటా నష్టాలు గణనీయంగా పెరుగుతున్నా సంస్థలో దిద్దుబాటు చర్యల మాటే వినిపించడం లేదు. టీఎస్‌ ఆర్టీసీ మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరం లెక్కలు ఖరారు చేసేందుకు మూడు నుంచి నాలుగు నెలలు అదనంగా తీసుకోవడం సంస్థ స్థితికి అద్దం పడుతోంది. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో మునిగి ఉన్న ఆర్టీసీకి ఇంతటి భారీ నష్టాలతో భవిష్యత్తులో అప్పు కూడా పుట్టని పరిస్థితి నెలకొనే ప్రమాదం లేకపోలేదు.

నష్టాల్లో తెలంగాణ ఆర్టీసీ రికార్డులను తిరగరాస్తోంది. సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే స్థాయిలో నష్టాలు నమోదు అవుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,002 కోట్లుగా ఉన్న నష్టం ఏడాదిలో 125 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కరోనాతో పాటు, సమ న్యాయం పేరిట అంతర్‌ రాష్ట్ర సర్వీసులను నిలిపివేయడం భారీ నష్టాలకు కారణంగా కనిపిస్తోంది. కరోనా తొలిదశ కట్టడి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధించడంతో బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. రాష్ట్రంలో 2020 మార్చి 22వ తేదీన ప్రారంభమైన లాక్‌డౌన్‌ దశల వారీగా 2021 మే 18 తేదీ వరకు కొనసాగింది. తొలిదశ లాక్‌డౌన్‌ అనంతరం 2020 నవంబరు 2 నుంచి అంతర్‌ రాష్ట్ర బస్సుల రాకపోకలు ప్రారంభమైనా ప్రజా రవాణాను వినియోగించేందుకు ప్రజలు ముందుకు రాకపోవడం ఆర్టీసీ ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. 2019-20లో 11.52 కోట్ల కిలోమీటర్లు బస్సులు తిరిగితే 2020-21లో 9.45 కోట్ల కిలోమీటర్లు మాత్రమే నడిచాయి. ఇదే సమయంలో తెలంగాణ-ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ మధ్య అంతర్‌ రాష్ట్ర సర్వీసుల ఒప్పందం విషయంలో నెలకొన్న సందిగ్థతో చాలాకాలం మంచి ఆదాయం వచ్చే మార్గాల్లో బస్సులు నడపలేని పరిస్థితి నెలకొంది. రెండు రాష్ట్రాల మధ్య సమ న్యాయం ప్రాతిపదికన బస్సులు నడిపేది లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల మధ్య పలు దఫాలు జరిగిన చర్చల అనంతరం బస్సులు నడిచినా అప్పటికే తీవ్ర నష్టం జరగింది. నష్టాల భారానికి డీజిల్‌ ధరల పెరుగుదల కూడా ఒక కారణంగా అధికారులు చెబుతున్నారు.

జవాబుదారీతనం ఏదీ..?

ఆర్టీసీ నష్టాలకు ఇతర కారణాలున్నా అధికారుల్లో జవాబుదారీతనం లేకపోవడం భారీ నష్టాలకు దారి తీసిందన్న అభిప్రాయం కార్మిక వర్గాల్లో వ్యక్తం అవుతోంది. నష్టాలకు కారణాలు విశ్లేషించటం, దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో అధికారులు చొరవ లేకపోవడంతో ఈ పరిస్థితి వచ్చిందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉమ్మడి రాష్ట్రంలో రవాణా శాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఆర్టీసీని గాడిలో పెట్టారు. పూర్తిస్థాయిలో అవగాహన ఉండడంతో అన్నీ ఆయన చూసుకుంటారులే అన్న ధోరణితో అధికారులు వ్యవహరిస్తున్నారన్నది ఆర్టీసీలో బహిరంగ చర్చ. నష్టాల నియంత్రణకు రవాణా రంగంలో అనుభవం ఉన్న నిపుణులతో ప్రభుత్వం కమిటీ వేసింది. విస్తృత స్థాయిలో అధ్యయనం చేసి ఇచ్చిన ఆ నివేదికలోని పనికి వచ్చే అంశాలను అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అధికారుల స్థాయిలో జరుగుతున్న దుబారా ఖర్చులను ముకుతాడు వేయాలి. ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు ఇస్తున్న పెట్రోలులో వాస్తవానికి వాడుతున్నది ఎంత? ఖర్చు చూపిస్తున్నది ఎంత? అన్నది ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమే. వీటిపై దృష్టి సారిస్తే ఏటా ఆదా అయ్యేది పెద్ద మొత్తంలోనే ఉంటుందనటంలో సందేహం లేదు.

ఏం చేయాలి...?

నష్టాలకు సహేతుకమైన కారణాలను గుర్తించాలి.

అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించాలి

  అధికారుల ఖర్చుకు కళ్లెం వేయాలి

 పూర్తిస్థాయి మేనేజింగ్‌ డైరెక్టర్‌ను నియమించాలి.

డీజిల్‌ పెంపుదల భారంలో కొంత మొత్తాన్ని ప్రభుత్వం భరించాలి

ఏటా అయిదారు శాతం మేరకు ఛార్జీల పెంపుదలకు అవకాశం కల్పించాలి 

విద్యుత్తు సంస్థలను ఆదుకున్నట్లుగా అప్పులను ప్రభుత్వం ఏకమొత్తంగా తీసుకోవాలి

వివిధ వర్గాలకు ఇస్తున్న రాయితీ మొత్తాలను నెలవారీగా ప్రభుత్వం చెల్లించాలి

2019 డిసెంబరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్లు సమావేశాలు నిర్వహించి ఉద్యోగుల్లో చైతన్యాన్ని ప్రోది చేయాలి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని