Weight: వయసు రెండేళ్లే.. బరువు మాత్రం 45 కిలోలు

రెండేళ్ల వయసుకే 45 కిలోల బరువు పెరిగిన ఖాయతి అనే చిన్నారికి దిల్లీలోని మాక్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స చేసి కడుపు పరిమాణాన్ని ..

Updated : 04 Aug 2021 12:23 IST

చిన్నారికి బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స చేసిన వైద్యులు

దిల్లీ: రెండేళ్ల వయసుకే 45 కిలోల బరువు పెరిగిన ఖాయతి అనే చిన్నారికి దిల్లీలోని మాక్స్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు బేరియాట్రిక్‌ శస్త్రచికిత్స చేసి కడుపు పరిమాణాన్ని తగ్గించారు. ఖాయతి పుట్టినప్పుడు 2.5 కిలోల సాధారణ బరువుతోనే ఉందని, ఆ తర్వాత 6 నెలలకే అనూహ్యంగా బరువు పెరిగి 14 కిలోలకు చేరుకుందని వైద్యులు చెప్పారు. 2 ఏళ్ల 3 నెలల వయసుకు 45 కిలోలు పెరిగిందన్నారు. సాధారణంగా ఆ వయసు అమ్మాయిలు 12-15 కిలోల బరువుంటారని పేర్కొన్నారు. అధిక బరువు వల్ల ఆ పాపకు ఎన్నో సమస్యలు వచ్చాయన్నారు. వెల్లకిలా పడుకుని నిద్రపోవడానికి వీలయ్యేదికాదని, నిద్రలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడేదని చెప్పారు. ఆమెను మోసుకెళ్లడానికి కూడా తల్లిదండ్రులు కష్టంగా ఉండేదని, అందుకే చక్రాల కుర్చీలోనే కూర్చోబెట్టేవారని తెలిపారు. ఇలాంటి పరిస్థితులతోనే బేరియాట్రిక్‌ సర్జరీకి సిద్ధమయ్యారన్నారు. చిన్నారుల్లో బేరియాట్రిక్‌ శస్త్ర చికిత్స చేసే విధానంపై ఎలాంటి సమాచారం కానీ, వీడియోలు కానీ లేకపోవడంతో ఇది తమకు సవాల్‌గా మారినట్లు చెప్పారు. సర్జరీ తర్వాత చిన్నారి బరువును క్రమంగా తగ్గించడానికి ప్రత్యేక ఆహార నియమాలు అనుసరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సాధారణ స్థాయికి చేరడానికి దాదాపు సంవత్సరం పడుతుందన్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని