Indian Railway: ప్రయోగాత్మకంగా హైడ్రోజన్‌ ఇంధనంతో రైళ్ల పరుగు

ప్రపంచవ్యాప్తంగా అతికొద్ది దేశాల్లో అమలులో ఉన్న హైడ్రోజన్‌ ఇంధన సాంకేతికతను భారతీయ రైల్వే

Updated : 09 Aug 2021 01:31 IST

బిడ్లను ఆహ్వానించిన రైల్వేశాఖ

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అతికొద్ది దేశాల్లో అమలులో ఉన్న హైడ్రోజన్‌ ఇంధన సాంకేతికతను భారతీయ రైల్వే కూడా ప్రవేశపెడుతోంది. ఇప్పటిదాకా జర్మనీ, పోలెండ్‌లలో మాత్రమే ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేశారు. ఈ విధానంలో సౌరశక్తి ద్వారా నీటి విద్యుద్విశ్లేషణ చేయడం ద్వారా హైడ్రోజన్‌ ఉత్పత్తి అవుతుంది. కాలుష్య రహిత హరిత రవాణా విధానంగా దీన్ని చెప్పుకోవచ్చు. హరియాణాలోని సోనిపట్‌ - జింద్‌ మార్గంలో 89 కిలోమీటర్ల మేర ఉత్తర రైల్వే నడిపే డెమూ రైలుకు హైడ్రోజన్‌ ఇంధన సాంకేతికతను వినియోగించనున్నట్లు సంబంధిత మంత్రిత్వశాఖ శనివారం ఓ ప్రకటన వెలువరించింది. దీనికి సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 5లోపు బిడ్లను దాఖలు చేయాల్సిందిగా ఆహ్వానించింది. బిడ్ల దాఖలుకు ముందు ఆగస్టు 17న ఈ విధానంపై ఓ సదస్సు కూడా ఏర్పాటు చేసింది. ఈ పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైతే ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న రైళ్లన్నింటిలో ఈ మార్పులు తీసుకువస్తారు. దీనివల్ల ఒక్కో రైలుకు ఏటా రూ.2.3 కోట్ల విలువైన ఇంధనం ఆదా కావడమే కాకుండా.. కర్బన ఉద్గారాలు ఏటా 11.12 కిలో టన్నుల నుంచి 0.72 కిలో టన్నులకు తగ్గుతాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని