Swagruha Flats: ‘స్వగృహ’ ఫ్లాట్ల వేలం!.. అపార్ట్‌మెంట్లతో పాటు  ఖాళీ భూములు కూడా..

సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ‘స్వగృహ’ ఫ్లాట్లను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Updated : 06 Sep 2021 12:14 IST

ఉన్నవి ఉన్నట్లుగా..  గుండుగుత్తగా విక్రయించే యోచన
బండ్లగూడ, పోచారం, జవహర్‌నగర్, గాజులరామారంలలో ప్రాజెక్టులు

ఈనాడు, హైదరాబాద్‌: సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న ‘స్వగృహ’ ఫ్లాట్లను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. విడివిడిగా కాకుండా ప్రాజెక్టుల వారీగా గుండుగుత్తగా అమ్మాలని నిర్ణయించినట్లు సమాచారం. కనీస ధర ప్రకటించి వేలం పద్ధతిలో రియల్టర్లకు విక్రయించే కసరత్తు జరుగుతోంది. ఇప్పటివరకు అమ్ముడుపోని ఫ్లాట్లు, ఆయా ప్రాజెక్టుల పరిధిలో భూముల వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ అధికారులు తాజాగా అందించినట్లు సమచారం.

విక్రయించని ఫ్లాట్లు 10 వేలకు పైనే!

ఉమ్మడి రాష్ట్రంలో మధ్యతరగతి వారిని దృష్టిలో పెట్టుకుని స్వగృహ కార్పొరేషన్‌ పలుచోట్ల రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌ల నిర్మాణం చేపట్టింది. దరఖాస్తులు ఆహ్వానించి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టింది. ధరలు అధికంగా ఉండటం, ఇతర కారణాలతో చాలావరకు అమ్ముడుపోలేదు. డిమాండ్‌ లేక కొన్నిచోట్ల పనులు మొదలుకాలేదు. నిర్మాణం మొదలైనచోట నిధుల సమస్య ఉండటంతో సగం వరకే నిర్మించారు. మరికొన్నిచోట్ల చిన్న, చిన్న పనులు మినహా తుది దశలో ఆగిపోయాయి. కోకాపేట తదితర ప్రాంతాల్లో భూముల వేలంతో పాటు వివిధ రూపాల్లో నిధులు సమీకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ‘స్వగృహ’ కార్పొరేషన్‌ ఫ్లాట్ల విక్రయంపై దృష్టి పెట్టింది. కొద్దిరోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఈ విషయంపై సమావేశం జరిగింది. గురువారం మరోసారి ప్రభుత్వ ఉన్నతాధికారులను కార్పొరేషన్‌ అధికారులు కలిసి వివరాలు అందించినట్లు సమాచారం. నాగోల్‌ బండ్లగూడ, పోచారం, జవహర్‌నగర్, గాజులరామారం.. ఈ నాలుగు ప్రాంతాల్లోనే విక్రయించని ప్లాట్లు దాదాపు 10 వేల వరకు ఉన్నట్లు అంచనా. బండ్లగూడలో 2,746 ఫ్లాట్లు నిర్మించగా.. 500 మాత్రమే అమ్ముడయ్యాయి. పోచారంలో అమ్మాల్సినవి దాదాపు 1,500 వరకు ఉన్నట్లు సమాచారం. ఈ రెండుచోట్ల ఫినిషింగ్‌ పనులు మినహా దాదాపు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. జవహర్‌నగర్‌లో 48 ఎకరాల్లో పుష్కరకాలం క్రితమే రూ.వెయ్యి కోట్ల అంచనా వ్యయంతో 6,214 ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. అప్పట్లో డిమాండ్‌ సర్వే చేయగా.. దాదాపు లక్ష దరఖాస్తులు వచ్చాయి. అయితే ధర ఎక్కువన్న భావనతో వెనక్కి తగ్గారు. 60 శాతానికిపైగా నిర్మాణ పనులు జరిగాయి. నిధుల సమస్య, గుత్తేదారులకు చెల్లింపులు ఆగడంతో ఉమ్మడి రాష్ట్రంలోనే పనులు నిలిచిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా తిరిగి మొదలుకాలేదు. నిర్మాణాలూ పూర్తి కాలేదు.

రూ.3,500కు చదరపు అడుగు!

వేలం పద్ధతిలో విక్రయించే ఫ్లాట్లకు కనీస ధరపై ఓ రియాల్టీ సంస్థతో స్వగృహ కార్పొరేషన్‌ కసరత్తు చేసింది. బండ్లగూడ, పోచారంలోని అపార్ట్‌మెంట్లలో కనీస ధర చదరపు అడుగుకు రూ.3,500గా ఖరారు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఉన్న స్థితిలోనే ఫ్లాట్లను విక్రయించాలని కార్పొరేషన్‌ నిర్ణయించింది. ప్రాజెక్టుల వారీగా మొత్తం ప్లాట్లతో పాటు అక్కడ ఖాళీగా ఉన్న భూములనూ విక్రయించనున్నట్లు తెలిసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని