TS News: పెద్దపల్లి జిల్లాలో అరుదైన మూషిక శిల్పం 

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం జనగాంలో 800 ఏళ్ల నాటి శిథిల శివాలయం వద్ద అరుదైన

Published : 09 Sep 2021 10:09 IST

800 ఏళ్ల నాటిదంటున్న పురావస్తు పరిశోధకులు 

ఈనాడు, హైదరాబాద్‌: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మండలం జనగాంలో 800 ఏళ్ల నాటి శిథిల శివాలయం వద్ద అరుదైన మూషిక శిల్పం బయటపడింది. ఈ గ్రామ శివారులో కాకతీయుల కాలం నాటి త్రిలింగ రాజరాజేశ్వర ఆలయం ఎదురుగా ఉన్న త్రికూటాలయంలో తుప్పలు, పొదలు తొలగిస్తుండగా బుధవారం ఈ గణపతి వాహనం వెలుగు చూసిందని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఎర్ర ఇసుకరాతితో చెక్కిన ఈ శిల్పం 3 అడుగుల పొడవు, రెండున్నర అడుగుల ఎత్తు ఉంది. ‘త్రిలింగాలయ అర్చకుడు రమేశ్‌శర్మ, రామోజు హరగోపాల్, సముద్రాల సునీల్‌ నేతృత్వంలోని కొత్త తెలంగాణ చరిత్ర బృందంతో కలిసి మూషిక వాహనాన్ని పరిశీలించాం. సర్వాభరణాలతో అలంకరించినట్లున్న ఈ శిల్పం గణపతిదేవుని కాలానికి చెందింది. త్రికూటాలయం రెండు ఆలయాల్లో శివలింగాలున్నాయి. మూడో ఆలయం వినాయకుడిదై ఉంటుంది. గుప్తనిధుల కోసం దుండగులు ఈ విగ్రహాన్ని పెకిలించి ఉంటారు’ అని వివరించారు. తెలంగాణలో ఇదే అతిపెద్ద మూషిక విగ్రహమని, దీనిని భద్రపరచాలని రాష్ట్ర ప్రభుత్వానికి శివనాగిరెడ్డి విజ్ఞప్తిచేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని