107 ఏళ్ల కవల బామ్మలు @ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌.. అందులో చోటు సంపాదించడమనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. వారికంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. ఫలానా రంగంలో వైవిధ్యమైన ప్రతిభ కనబరచాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న బామ్మలకు ఓ ప్రత్యేకత ఉందండోయ్‌! ప్రపంచంలోనే వృద్ధ కవలలు (మహిళల విభాగంలో) వీరిద్దరు గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కారు. వారి గురించి వారి మాటల్లో ఏమని చెబుతారంటే.. 

Updated : 21 Sep 2021 20:31 IST

టోక్యో: గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌.. అందులో చోటు సంపాదించడమనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. వారికంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. ఫలానా రంగంలో వైవిధ్యమైన ప్రతిభ కనబరచాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న బామ్మలకు ఓ ప్రత్యేకత ఉందండోయ్‌! ప్రపంచంలోనే వృద్ధ కవలలుగా (మహిళల విభాగంలో) వీరిద్దరు గిన్నిస్‌ రికార్డుల్లోకెక్కారు. వారి గురించి వారి మాటల్లో ఏమని చెబుతారంటే.. 

రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూశాం...
హాయ్‌! మా పేర్లు.. ఉమే నో సుమియమా, కౌమే కొదమా. మా వయసు 107 సంవత్సరాల, 320 రోజులు. 1913లో జపాన్‌లోని షోడోషిమా ద్వీపంలో మేమిద్దరం జన్మించాం. మా తల్లిదండ్రులకు 13 పిల్లల్లో మేము మూడు, నాలుగో సంతానం. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కడం చాలా సంతోషంగా ఉంది. జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే ఎన్నో మరుపురాని క్షణాలు. రెండో ప్రపంచ యుద్ధాన్ని ప్రత్యక్షంగా చూశాం. ఆరోజులన్నీ తలుచుకుంటే ఇప్పటికీ మా కళ్ల ముందు కదులుతున్నట్లే అనిపిస్తాయి. రెండో ప్రపంచ యుద్ధం ముగిసేసరికి ఇళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వైమానిక దాడి జరిగే సమయంలో తలదాచుకోవడానికి ఓ పర్వతప్రాంతంలో ఆశ్రయం పొందాం. 

దశాబ్దానికి ఓసారి కలుసుకునేవాళ్లం
ఎలిమెంటరీ స్కూల్‌ల్లో చదువు తరువాత.. వేర్వేరు ప్రదేశాల్లో స్థిరపడ్డాం. ఎవరి జీవితాల్లో బిజీబిజీగా గడిపాం అందుకే దశాబ్దానికి ఒక్కసారి కలుసుకోవాల్సి వచ్చేది. జపాన్‌లోని షికోకు ఆలయాలను సందర్శించాలంటే మాత్రం ఇద్దరూ కలిసి వెళ్తాం.

పాజిటివ్‌ థింకింగ్‌ అసలు రహస్యం
100ఏళ్లు దాటినా ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండటానికి కారణమేమిటంటే.. పాజిటివ్‌ థింకింగ్‌ చేయడం, చుట్టూ జరుగుతున్న విషయాల గురించి పెద్దగా పట్టించుకోకపోడమే అసలు రహస్యం అంటారు ఈ ఇద్దరు బామ్మలు .ప్రస్తుతం విడివిడిగా నర్సింగ్‌ హోమ్స్‌లో నివసిస్తున్నారు. కరోనా కారణంగా నేరుగా కలవలేక గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ వారికి సర్టిఫికెట్‌ను ఈ-మెయిల్‌ ద్వారా పంపించారు. వాటిని చూసి ఇలా ఫొటోలకు పోజులిచ్చారు.

అందుకే జపాన్‌ స్పెషల్‌
జపాన్‌లో వృద్ధుల జనాభా ఎక్కువ. గణాంకాల వారీగా పరిశీలిస్తే.. మొత్తం జనాభాలో 65 ఏళ్లు పైబడిన వారు దాదాపు 29 శాతం మంది ఉన్నారు. ఇక 100ఏళ్లు దాటిన వారు 80వేలకు పైగా ఉండటం విశేషం. ప్రపంచం మొత్తంలో జపాన్‌లో ప్రజలు ఎక్కువ ఏళ్లు బతుకుతారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని