TS News: తెలంగాణలో రోజుకు 57 ప్రమాదాలు.. 19మరణాలు

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల గత నాలుగేళ్లుగా తగ్గుముఖం పట్టిన ప్రమాదాలు

Published : 10 Oct 2021 10:58 IST

ఈ ఏడాది ఎనిమిది నెలల్లో ఇదీ తీరు
గత ఏడాది కంటే పెరిగిన సంఖ్య

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల గత నాలుగేళ్లుగా తగ్గుముఖం పట్టిన ప్రమాదాలు ఈ ఏడాది జనవరి నుంచి అనూహ్యంగా పెరుగుతున్నాయి. మరణాలు, క్షతగాత్రుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఆందోళనకరం. కరోనా కారణంగా వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడమే ఇందుకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదాల కట్టడిపై దృష్టి సారించారు.

రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకూ 8 నెలల్లో 13682 ప్రమాదాలు, 4655 మరణాలు నమోదు కాగా 12989 మంది గాయపడ్డారు. గత ఏడాది (2020) మొదటి ఎనిమిది నెలల్లో 11,639 ప్రమాదాలు, 4144 మరణాలు నమోదు కాగా 11470 మంది గాయపడ్డారు. అంటే గత ఏడాది కంటే ఈసారి 2043 ప్రమాదాలు, 511 మరణాలు అధికంగా సంభవించాయి. క్షతగాత్రులు 1519 మంది పెరిగారు. 

ఈ లెక్కన రాష్ట్రంలో ఈ ఏడాది సగటున రోజుకు 57 ప్రమాదాలు జరుగుతుండగా... 19 మంది మరణిస్తున్నారు. గత ఏడాది ఎనిమిది నెలల్లో రోజుకు 48 ప్రమాదాలు జరగ్గా 17 మంది మరణించారు. గత ఏడాది కంటే ఈసారి రోజుకు 9 ప్రమాదాలు, రెండు మరణాలు అధికంగా నమోదయ్యాయి. 

తగ్గినట్టే తగ్గి...

రాష్ట్రంలో ఎక్కువ ప్రమాదాలు జరిగే బ్లాక్‌స్పాట్లను గుర్తించి రహదారులను సరిదిద్దడం, వాహనాల వేగాన్ని నియంత్రించడం వంటి చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఫలితంగా 2017 నుంచి రోడ్డు ప్రమాదాలు, మరణాలు, క్షతగాత్రుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా కారణంగా మొదటి లాక్‌డౌన్‌ విధించిన 2020లో ఇవి గణనీయంగా తగ్గాయి. 2019లో 21,570 ప్రమాదాలు జరగ్గా 2020లో 16866కు పరిమితమయ్యాయి. ఈ ఏడాది మళ్లీ అదుపు తప్పాయి.

వ్యక్తిగత వాహనాల వినియోగం పెరగడమే

మామూలు రోజుల్లో 78 శాతం ఉండే ఆర్టీసీ ఆక్యుపెన్సీ కరోనా వల్ల సగటున 68 శాతానికి పడిపోయింది. కరోనాకు ముందు హైదరాబాద్‌ మెట్రో రైల్లో రోజుకు సగటున 4 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 2 లక్షలకు పడిపోయింది. జనం సొంత వాహనాల్లో ప్రయాణిస్తుండడమే దీనికి కారణం. ఫలితంగా రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. గత ఏడాది మార్చిలో తొలివిడత లాక్‌డౌన్‌ విధించారు. మే నెల వరకూ ఆంక్షలు కొనసాగాయి. మే నెలలో రాష్ట్రంలో మొత్తం 38,865 వాహనాలు అమ్ముడు పోగా... జూన్‌లో రెట్టింపు కంటే ఎక్కువగా 87,128 వాహనాలు విక్రయమయ్యాయి. అప్పటి నుంచి వాహన విక్రయాలు పెరుగుతున్నాయి. ప్రమాదాలకు ఇది కూడా ఒక కారణమని అధికారులు విశ్లేషిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని