
TS News: యాదాద్రీశుడికి భారీగా బంగారం విరాళాలు
తొలి రోజే 22 కిలోలు.. హెటెరో సంస్థ 5 కిలోలు
కిలో ప్రకటించిన హరీశ్‌రావు, పలువురు ప్రజాప్రతినిధులు
హైదరాబాద్: యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి తొలి విరాళం ప్రకటించిన కొన్ని గంటల్లోనే తామూ బంగారం ఇచ్చేందుకు పలువురు దాతలు ముందుకొచ్చారు. వీరిలో కొందరి పేర్లను ముఖ్యమంత్రి మంగళవారం యాదాద్రి పర్యటన సందర్భంగా స్వయంగా ప్రకటించారు. ఒక్కరోజులోనే సుమారు 22 కిలోల పసిడి విరాళంగా సమకూరింది. హెటెరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ పార్థసారథిరెడ్డి 5 కిలోల బంగారాన్ని విరాళమివ్వనున్నట్లు ప్రకటించారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజల తరఫున కిలో బంగారం ఇస్తామని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మైనంపల్లి హన్మంతరావు, మాధవరం కృష్ణారావు, వివేకానంద్, ఎమ్మెల్సీలు కె.నవీన్ కుమార్, శంభీపూర్ రాజు, ఏపీలోని కడప జిల్లా చిన్న మండెం జడ్పీటీసీ సభ్యురాలు, వ్యాపారవేత్త మోడెం జయమ్మ ఒక్కొక్కరు కిలో బంగారం చొప్పున ఇస్తామని ప్రకటించారు.