పరిమితంగానే ఉపాధ్యాయుల డిజిటల్‌ నైపుణ్యాలు

కొవిడ్‌ సమయంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులే దిక్కయ్యాయి! ఈ ప్రయత్నంలో కొన్ని అడ్డంకులు తప్పలేదు...

Updated : 27 Oct 2021 14:01 IST

ఆన్‌లైన్‌ విద్యపై ఓయూపీ అధ్యయనం

దిల్లీ: కొవిడ్‌ సమయంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులే దిక్కయ్యాయి! ఈ ప్రయత్నంలో కొన్ని అడ్డంకులు తప్పలేదు. ముఖ్యంగా ఉపాధ్యాయుల్లో చాలామందికి డిజిటల్‌ నైపుణ్యాలు లేకపోవడం; కొన్నివర్గాల విద్యార్థులకు డిజిటల్‌ వసతులు, సామర్థ్యాలు కొరవడటం; వీడియో ద్వారా పాఠాల పట్ల వారిలో శ్రద్ధ కలిగించడం సవాళ్లుగా నిలిచినట్టు... ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సీటీ ప్రెస్‌ (ఓయూపీ) తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు ‘అడ్రసింగ్‌ డిపెండింగ్‌ డిజిటల్‌ డివైడ్‌’ పేరుతో ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది. భారత్‌ సహా మొత్తం 92 దేశాలకు చెందిన 1,557 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో హాజరైన ఆంగ్ల తరగతులపై ఓయూపీ అధ్యయనం సాగించింది. తదనుగుణంగా సర్వే చేపట్టి, నివేదిక రూపొందించారు.

ఉపాధ్యాయుల డిజిటల్‌ నైపుణ్యాలు చాలా పరిమితం. డిజిటల్‌ పరికరాలు, ఇంటర్నెట్‌ సదుపాయం లేనివారితో సమానంగా ఈ సమస్య ఉంది. ఆన్‌లైన్‌ బోధనకు ప్రధాన ఆటంకం ఇదే అని 68% మంది బోధకులు అభిప్రాయపడ్డారు.
ఉపాధ్యాయులు, విద్యార్థుల డిజిటల్‌ సామర్థ్యాలు తక్కువగా ఉంటున్నట్టు 56% మంది చెప్పారు.
విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్, విద్యుత్తు వంటి వసతులన్నీ ఉన్నా, ఆన్‌లైన్‌ విధానం ద్వారా వారు పాఠాల్లో నిమగ్నమయ్యేలా చెయ్యడం పెద్ద సమస్యగా మారిందని 61% మంది ఉపాధ్యాయులు చెప్పారు.
డిజిటల్‌ పరికరాలు, వసతుల లేమి కారణంగా వెనుకబడిన విద్యార్థుల అభ్యాసనపై ఆన్‌లైన్‌ బోధన తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది.
58% మంది తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులకు డిజిటల్‌ పరికరాలపై సరైన అవగాహనే లేదు. దీంతో విద్యార్థుల ఆన్‌లైన్‌ అభ్యాసనకు వారి నుంచి సరైన తోడ్పాటు లభించలేదు.

డిజిటల్‌ అంతరాలను తగ్గించాలి: ఓయూపీ
సమాజంలో డిజిటల్‌ అంతరాలను తగ్గించేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని... ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ డిజిటల్‌ నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్‌ సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని