AP News: ఆసుపత్రికి వెళ్లిన భర్త.. తిరిగి రాడని చెప్పేదెలా!

అతనికి 11 నెలల బాబు.. ఎనిమిది నెలల గర్భవతి అయిన భార్య ఉన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో అతనికి కాలు విరగడంతో.. అప్పుడు వేసిన ప్లేట్లను తీయించి ఇంటికొస్తానని చెప్పి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందాడన్న చేదు నిజాన్ని ఆ

Updated : 01 Nov 2021 07:52 IST


ఆసుపత్రి బయట రోదిస్తున్న మృతుడి బంధువులు

మసీదు సెంటర్‌ (కాకినాడ): అతనికి 11 నెలల బాబు.. ఎనిమిది నెలల గర్భవతి అయిన భార్య ఉన్నారు. రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో అతనికి కాలు విరగడంతో.. అప్పుడు వేసిన ప్లేట్లను తీయించి ఇంటికొస్తానని చెప్పి ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందాడన్న చేదు నిజాన్ని ఆమెకు ఎలా చెప్పాలని బంధువులు విలపిస్తున్న తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రితో చికిత్స పొందుతూ మృతి చెందడంపై బంధువులు అనుమానం వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందారని ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా, జీలుగమిల్లికి చెందిన కుందేటి త్రిమూర్తులు (32) కాకినాడ ఏపీఎస్పీలో హెచ్‌సీగా విధులు నిర్వర్తిస్తున్నారు. త్రిమూర్తులకు రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోవడంతో ప్లేట్స్‌ వేయించుకున్నారు. వాటిని తొలగించేందుకు సెప్టెంబరు 29న కాకినాడలోని ఓ ఆసుపత్రిలో చేరగా, 30న వైద్యులు శస్త్రచికిత్స చేశారు. గుండె పోటుతో ఆదివారం అతను మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పడంతో అంతా ఒక్కసారిగా నమ్మలేకపోయారు. మృతి వార్త తెలుసుకున్న బంధువులు అక్కడ రోదించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా ఎలా మృతి చెందుతారని, వైద్యులు నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో శాంతించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని