Published : 17 Nov 2021 10:45 IST

Toxic Positivity: అమితానందం కోసం ఆరాటమొద్దు

దక్కకపోతే మిగిలేది విచారమే.. ఆస్ట్రేలియా పరిశోధకుల సూచన

సిడ్నీ: ‘జరిగేవన్నీ మంచికని, అనుకోవడమే మనిషి పని’ అన్నట్టు... ప్రతి సందర్భంలోనూ సానుకూల దృక్పథంతో ఉండటం మంచిదే! ఇలాంటివారు మిగతావారి కంటే ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారని, ఎక్కువకాలం జీవిస్తారని చాలా పరిశోధనలు తేల్చాయి. అలాగని అతి సానుకూల భావన మాత్రం పనికిరాదంటున్నారు... ఆస్ట్రేలియాకు చెందిన ఫెడరేషన్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు! ఆనందం కోసం తీవ్రంగా వెంపర్లాడేవారు ఆస్వాదించడాన్ని మర్చిపోయి, విచారగ్రస్థులు అవుతారని హెచ్చరిస్తున్నారు. దీన్ని వారు ‘టాక్సిక్‌ పాజిటివిటీ’గా పిలుస్తున్నారు. ‘అమితానందం కోరుకునేవారు అసలు దాన్ని పొందుతున్నారా?’ అన్న అంశంపై వారు అధ్యయనం సాగించారు. ఇందులో భాగంగా సుమారు 500 మందిని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ‘జర్నల్‌ ఆఫ్‌ పాజిటివ్‌ సైకాలజీ’ అందించింది.

పరిశోధకులు ఏం చెప్పారంటే..
😆 ‘ఒక్కటే జీవితం. బతికినంతకాలం ఆనందించాలి. అన్నీ ఆస్వాదించాలి’ అని భావించే చాలామందికి అది అందని ద్రాక్షే అవుతుంది. చాలా సందర్భాల్లో ఆశించింది వారికి దక్కదు. దక్కినా అనుకున్న స్థాయిలో ఉండదు. దీంతో వారి సంతృప్తి స్థాయులు పడిపోతాయి. కోరుకున్నది దొరకలేదన్న దిగులు చుట్టుముడుతుంది.
😆 తక్షణ ఆనందం (ఇన్‌స్టంట్‌ హ్యాపీనెస్‌) పంచే చర్యల కంటే, భవిష్యత్తులో తమ ఆనందాన్ని పెంచే ప్రవర్తనను అలవర్చుకున్న వారిలోనే ఆ సంతృప్తి ఎక్కువగా ఉంటుంది. రోజువారి కార్యకలాపాలను సమర్థంగా నిర్వర్తించడం, క్లిష్టమైన పనులను పూర్తిచేసి, ఆ సంతృప్తిని ఆస్వాదించడం వంటివి మంచి మానసిక భావన కలిగిస్తాయి.
😆 ఆనందం అనేది నేరుగా దొరికేది కాదు. దానికి కారణమయ్యేవి ఆలోచనలు, నిర్ణయాలు, చర్యలే. కాబట్టి వాటిపై దృష్టి పెట్టాలి.
😆 అమితానందం కోరుకునేవారు తరచూ ‘నేనేం సంతోషంగా లేను. నాలో ఏదో లోపముంది’ అని అంటుంటారు. అదే.. ‘ఎప్పటిపని అప్పుడు పూర్తిచేస్తాను. దాని వల్ల నా ఆనందం రెట్టింపు అవుతుంది’ అని భావించే వారే ఎక్కువ సంతోషంగా ఉంటారు.
😆 జీవితంలో దుఃఖం, వైఫల్యం, కష్టం, నష్టం, అసంతృప్తి అన్నవి ప్రతి ఒక్కరికి అత్యంత సర్వ సాధారణం. ఇవి తలెత్తినప్పుడు లక్ష్యానికి ఆటంకం కలిగిందని భావించకూడదు. ఇవి మామూలేనని సరిపెట్టుకుని, ముందుకు వెళ్లేందుకు సన్నద్ధమైతేనే వాటి కారణంగా విచారం దరిచేరదు. పైగా జీవితం సానుకూలంగా, మరింత సంతృప్తిగా ఉంటుంది.
😆 ఒక్కటి మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి: నొప్పి ఎవరికైనా ఒక్కటే. బాధ పడతావా? లేదా? అన్నది మాత్రం నీ ఇష్టం.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని