James Webb Space Telescope: జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు ప్రయోగం మళ్లీ వాయిదా

అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ) ప్రయోగం మరోసారి వాయిదా ..

Published : 24 Nov 2021 10:46 IST

ఆకస్మికంగా ఊడిపడ్డ క్లాంపు వల్లే..

బెర్లిన్‌: అమెరికా అంతరిక్ష సంస్థ ‘నాసా’ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన జేమ్స్‌ వెబ్‌ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్‌టీ) ప్రయోగం మరోసారి వాయిదా పడింది. దీన్ని వచ్చే నెల 22న చేపట్టే అవకాశం ఉంది. ఫ్రెంచ్‌ గయానాలోని కౌరూ అంతరిక్ష కేంద్రంలో ఈ టెలిస్కోపును వాహకనౌకకు సంబంధించిన అడాప్టర్‌తో అనుసంధానించే క్రమంలో పొరపాటున ఒక క్లాంప్‌ ఊడిపోయింది. దీంతో టెలిస్కోపు ఆకృతిలో ఒక్కసారిగా ప్రకంపన తలెత్తింది. దీనివల్ల ఈ సాధనం దెబ్బతిందా అన్నది పరిశీలించనున్నారు. ఇందుకోసం దీన్ని పరీక్షించాలని నాసా నిర్ణయించింది. ఈ వారాంతంలో దీన్ని పూర్తి చేస్తామని పేర్కొంది.

ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)కు చెందిన ఏరియాన్‌-5 రాకెట్‌ ద్వారా జేడబ్ల్యూఎస్‌టీని  రోదసిలోకి ప్రవేశపెట్టాలని నాసా నిర్ణయించింది. దీన్ని వాస్తవానికి అక్టోబరు 31న ప్రయోగించాల్సింది. ఇందుకు అనుగుణంగా ఆగస్టులోనే ఫ్రెంచ్‌ గయానా చేరుకోవాల్సింది. అక్కడ రెండు నెలల పాటు తుది సన్నాహాలు చేయాల్సింది. అయితే జేడబ్ల్యూఎస్‌టీ తుది పరీక్షల్లో జాప్యం కారణంగా అది వాయిదా పడింది. దీంతో డిసెంబరు 18న ప్రయోగాన్ని చేపట్టాలని నాసా, ఐరోపా అంతరిక్ష సంస్థ నిర్ణయించాయి. తాజా ఘటనతో అది మరో నాలుగు రోజులు వాయిదా పడింది.

రోదసిలో ఎక్కడికి ప్రయోగిస్తారు?
భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండో లాగ్రేంజ్‌ పాయింట్‌ (ఎల్‌2)కు ఈ టెలిస్కోపు చేరుతుంది. ఇది భూమి నుంచి చంద్రుడి మధ్య ఉన్న దూరంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ. ప్రయోగానంతరం ఈ టెలిస్కోపు అక్కడికి చేరుకోవడానికి రెండు వారాలు పడుతుంది.

ఏమిటిదీ...?
రోదసిలోని హబుల్‌ టెలిస్కోపు స్థానంలో జేడబ్ల్యూఎస్‌టీని ప్రవేశపెడుతున్నారు. దృశ్యకాంతి కన్నా ఎక్కువ తరంగదైర్ఘ్యాలు కలిగి ఉండే నియర్‌ ఇన్‌ఫ్రారెడ్, మిడ్‌ ఇన్‌ఫ్రారెడ్‌ తరంగ దైర్ఘ్యాల్లో విశ్వాన్ని పరిశీలిస్తుంది.

1350 కోట్ల సంవత్సరాల కిందట విశ్వం ఆవిర్భవించిన వెంటనే.. చీకట్లను చీల్చుకుంటూ ఏర్పడ్డ తొలి నక్షత్రాలు, గెలాక్సీలను ఈ అధునాతన సాధనం ద్వారా శాస్త్రవేత్తలు పరిశీలిస్తారు. తద్వారా.. మిణుకుమిణుకుమనే తొలినాటి నక్షత్ర మండలాలను నేటి భారీ స్పైరల్, దీర్ఘవృత్తాకార గెలాక్సీలతో పోల్చి చూస్తారు. నక్షత్రాలు, గ్రహాల ఆవిర్భావానికి కారణమయ్యే భారీ ధూళి మేఘాల లోపలి అంశాలనూ చూడొచ్చు.

సౌర కుటుంబానికి సంబంధించిన అంతుచిక్కని అంశాలనూ ఇది శోధిస్తుంది. విశ్వం పుట్టుక గుట్టు విప్పడానికి ప్రయత్నిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని