omicron: ఒమిక్రాన్‌.. గుట్టు విప్పేందుకు సీసీఎంబీకి

కొవిడ్‌ కొత్త రకం ఒమిక్రాన్‌పై అధ్యయనం చేసేందుకు పరిశోధన సంస్థలు అప్రమత్తమయ్యాయి.

Published : 01 Dec 2021 09:24 IST

హైదరాబాద్‌: కొవిడ్‌ కొత్త రకం ఒమిక్రాన్‌పై అధ్యయనం చేసేందుకు పరిశోధన సంస్థలు అప్రమత్తమయ్యాయి. వైరస్‌ జన్యుక్రమ ఆవిష్కరణలో అనుభవం కలిగిన సీసీఎంబీ మరోసారి కొవిడ్‌ జీనోమ్‌ సీక్వెన్సింగ్‌పై దృష్టి పెట్టింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు తప్పనిసరి చేశారు. పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన కేసుల్లో ఐదు శాతం నమూనాలను వైరస్‌ జన్యుక్రమ ఆవిష్కరణకు సీసీఎంబీ, సీడీఎఫ్‌డీ, గాంధీ ఆసుపత్రి ల్యాబ్‌లకు పంపనున్నారు. ఇందులో అత్యధిక నమూనాలు సీసీఎంబీకి చేరుతున్నాయి. గత ఏడాది మే నుంచి సీసీఎంబీలో వైరస్‌ జన్యుక్రమ పరిశోధనలు జరుగుతున్నాయి. కొవిడ్‌ రెండోదశ సమయంలో వీటిపై ముమ్మరంగా పనిచేశారు. ఎప్పటికప్పుడు సర్కారును అప్రమత్తం చేశారు. కొద్ది నెలలుగా డెల్టారకం తగ్గుముఖం పట్టడం.. నమూనాల్లో అత్యధికం డేల్టా వేరియంటే బయటపడుతుండటంతో క్రమంగా జన్యుక్రమ ఆవిష్కరణకు వచ్చే నమూనాలు తగ్గిపోయాయి. ఇప్పుడు ఒమిక్రాన్‌.. డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తున్నట్లు అంచనాల నేపథ్యంలో నగరంలో వెలుగు చూస్తున్న కేసులు ఏరకానికి చెందినవో తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీంతో పాజిటివ్‌ వచ్చిన నమూనాలు జన్యుక్రమ ఆవిష్కరణ కోసం సీసీఎంబీకి పంపుతున్నారు. ఇతర నగరాల నుంచి కూడా నమూనాలు వస్తున్నాయి. వాటిలో మ్యుటేషన్లు, వ్యాప్తి తీరునూ ఇక్కడి పరిశోధకులు అంచనా వేయనున్నారు. అందుకు కొంత సమయం పడుతుందని చెబుతున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని