Vijayawada: విజయవాడలోని ఎన్‌హెచ్‌పై 3 వంతెనలు

విజయవాడ మీదుగా వెళ్లే చెన్నై-కోల్‌కత జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌)-16పై మూడు చోట్ల వెహికల్‌ అండర్‌పాస్‌లు (వంతెనలు) రానున్నాయి. 

Published : 06 Dec 2021 09:43 IST

డీపీఆర్‌ తయారు చేయించనున్న ఎన్‌హెచ్‌ఏఐ

ఈనాడు, అమరావతి: విజయవాడ మీదుగా వెళ్లే చెన్నై-కోల్‌కత జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌)-16పై మూడు చోట్ల వెహికల్‌ అండర్‌పాస్‌లు (వంతెనలు) రానున్నాయి. ఇందుకు డీపీఆర్‌ల తయారీకి వీలుగా సలహాసంస్థల ఎంపికకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) టెండర్లు పిలవనుంది. బెంజ్‌ సర్కిల్‌లో గతంలోనే ఓ ఫ్లైఓవర్‌ నిర్మించగా, ఇప్పుడు రెండో ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌ సమస్య కొంత తగ్గింది. అయితే మహానాడు కూడలి, రామవరప్పాడు రింగ్, తాడిగడప వంద అడుగుల రహదారి కలిసే ఎనికేపాడు వద్ద ట్రాఫిక్‌ సమస్యలు పెరిగి, తరచూ ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ఈ ప్రాంతాల్లో వెహికల్‌ అండర్‌ పాస్‌లు (వీయూపీ)లు నిర్మించాలని రహదారులు, భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) కోరింది. ఇప్పటికే చిన్నఅవుటపల్లి నుంచి గొల్లపూడి మీదుగా గుంటూరు జిల్లాలోని కాజ వరకు ఆరు వరుసలతో బైపాస్‌ నిర్మిస్తుండటంతో.. విజయవాడ మీదుగా వెళ్తున్న ఎన్‌హెచ్‌-16ని మున్ముందు ఆర్‌అండ్‌బీకి అప్పగించనున్నారు. దీంతో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద మూడు చోట్ల వీయూపీలు నిర్మించాలని కోరడంతో, దీనికి ఎన్‌హెచ్‌ఏఐ సమ్మతించింది. ఈ మూడుచోట్ల స్థల సమస్య ఉందని, వీయూపీలపై సలహా సంస్థ ఇచ్చే డీపీఆర్‌ల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

10న గడ్కరీ రాక.. ప్రారంభోత్సవాలు

విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌-2 వంతెన ప్రారంభోత్సవానికి ఈ నెల 10న కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ రానున్నారు. ఏపీ వ్యాప్తంగా రూ.25వేల కోట్ల ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ఎన్‌హెచ్‌ఏఐ, రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విశాఖ-రాయ్‌పుర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిలో భాగంగా విశాఖ నుంచి విజయనగరం జిల్లా మీదుగా ఒడిశా సరిహద్దు వరకు 100 కి.మీ. నిర్మించే ఆరు వరుసల రహదారి, విజయవాడ-నాగ్‌పుర్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారిలో భాగంగా విజయవాడ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు నిర్మించే మార్గానికి, ఖమ్మం-దేవరపల్లి మధ్య గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి, చిత్తూరు-తచ్చూరు గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి, బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా చిత్తూరు జిల్లాలో పరిధిలో నిర్మిస్తున్న ప్యాకేజీలు, పామర్రు-ఆకివీడు రహదారి, కొయ్యూరు-చాపరాతిపాలెం-లంబసింగి మధ్య రహదారి తదితరాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని