TSRTC: విద్యుత్తు బస్సులతో ఆర్టీసీకి షాక్‌!

ఆదాయం మూరెడు, ఖర్చు బారెడు అన్నట్లుగా ఉంది హైదరాబాద్‌లో ఆర్టీసీ విద్యుత్తు బస్సుల పరిస్థితి. కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు కేంద్రం విద్యుత్తు బస్సులను ప్రోత్సహించింది.

Published : 08 Dec 2021 09:12 IST

తప్పని భారీ నష్టాలు.. మరోవైపు కరోనా కష్టాలు

హైదరాబాద్‌: ఆదాయం మూరెడు, ఖర్చు బారెడు అన్నట్లుగా ఉంది హైదరాబాద్‌లో ఆర్టీసీ విద్యుత్తు బస్సుల పరిస్థితి. కాలుష్యానికి చెక్‌ పెట్టేందుకు కేంద్రం విద్యుత్తు బస్సులను ప్రోత్సహించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో తొలి దశలో భాగంగా ఒక్కో బస్సుకు రూ.కోటి వరకు రాయితీని సైతం ఇచ్చింది. తెలంగాణ ఆర్టీసీ ఆ పథకం కింద 40 బస్సులను తీసుకునేందుకు ముందుకు వచ్చింది. అయితే వాటిని కొనుగోలు చేయకుండా అద్దె ప్రాతిపదికన తీసుకుంది. వాటన్నిటినీ హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుపుతోంది. కరోనా ముందు వరకు ఫర్వాలేదన్నట్లున్న ఆదాయం ఇప్పుడు పూర్తిగా సన్నగిల్లింది. లాక్‌డౌన్‌ సమయంలో నాలుగు నెలల పాటు సర్వీసులు పూర్తిగా నిలిచిపోవడం, తరవాత విమానాల రాకపోకలు ప్రారంభమైనా ఆదాయం మాత్రం పుంజుకోకపోవడంతో ఆర్టీసీ ఈ బస్సుల విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. విద్యుత్తు బస్సుల ఆదాయ, వ్యయాలపై సమాచారం హక్కు చట్టం కింద ఆర్టీసీ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావుకు అధికారులు అందించిన సమాచారం ప్రకారం ఆదాయం చాలా తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. 2019-20లో రెండో దశలో మరిన్ని బస్సులు ఇచ్చేందుకు కేంద్రం ప్రతిపాదించింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్‌ నగరాల్లో కూడా విద్యుత్తు బస్సులు నడిపేందుకు ముందుకు వస్తే రాయితీ ఇస్తామని ప్రకటించింది. అయితే గతంలో ఇచ్చిన రాయితీని రూ.కోటి నుంచి రూ.60 లక్షలకు తగ్గించింది. అదే సమయంలో తెలంగాణ ఆర్టీసీలో సమ్మె జరుగుతుండడంతో ఆ పథకాన్ని వినియోగించుకునేందుకు అధికారులు ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం కిలోమీటరుకు రూ. 33.94 ఆదాయం లభిస్తే కేవలం లీజుకే  కిలోమీటరుకు రూ.33.12 చొప్పున చెలిస్తున్నారు. ఇది కాకుండా ఆయా వాహనాల బ్యాటరీలకు ఛార్జింగ్‌ చేసేందుకు అయ్యే విద్యుత్తు ఛార్జీలు, ఇతర వ్యయాలు అన్ని కలుపుకుంటే తడిసిమోపెడవుతోంది. 

సొంతమైతే బాగుండేది..

విద్యుత్తు బస్సులను తయారు చేస్తున్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సంస్థ ఒక్కో బస్సులకు రూ. 2.50 కోట్ల ధరను ప్రతిపాదించింది. ఆ ధర అధికంగా ఉందంటూ కేంద్ర ప్రభుత్వం హేతుబద్ధీకరించి రూ.1.60 కోట్లుగా ఖరారు చేసింది. అందులో రూ.కోటి కేంద్రం రాయితీ రూపంలో ఇచ్చింది. విద్యుత్తు ఛార్జింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా అదనంగా కొంత మొత్తాన్ని కేంద్రం ఇచ్చింది. విద్యుత్తు బస్సు కొనుగోలు వ్యయాన్ని భరించలేమని, ఆర్టీసీ లీజు ప్రాతిపదికన తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. బస్సులతో పాటు  డ్రైవర్‌ బాధ్యత కూడా లీజు సంస్థే తీసుకుంది. కేంద్రం ఇస్తున్న రాయితీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంటు రూపంలో అదనంగా కొంత నిధులను సమకూర్చి ఉంటే ఆర్టీసీకి ఆ బస్సులు సొంతం కావటంతోపాటు లీజు వ్యయం కాస్తంత ఆదా అయ్యేదన్న అభిప్రాయం అధికారుల్లో వ్యక్తం అవుతోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు