China: ముగ్గురు పిల్లల్ని కనరూ.. ప్రజలకు చైనా ప్రావిన్సుల ఆఫర్లు

దశాబ్దాలుగా ఏకైక సంతానం విధానాన్ని కఠినంగా అమలు చేసిన చైనా ఇప్పుడు పూర్తిగా పంథా మార్చింది.

Published : 08 Dec 2021 11:00 IST

బీజింగ్‌: దశాబ్దాలుగా ఏకైక సంతానం విధానాన్ని కఠినంగా అమలు చేసిన చైనా ఇప్పుడు పూర్తిగా పంథా మార్చింది. ఇద్దరు కాదు ముగ్గుర్ని కనమని ప్రజలను ప్రోత్సహిస్తోంది. అందుకు కావాల్సినన్ని సెలవులు ఇస్తామని, పన్నులనూ తగ్గిస్తామని ఊరిస్తోంది. ఒకే బిడ్డ విధానం వల్ల కొన్ని దశాబ్దాలుగా చైనా జనాభా గణనీయంగా తగ్గిపోయింది. 2016 నుంచి ఇద్దరు సంతానానికి అనుమతించినా పెద్దగా ఫలితం కనిపించలేదు. దీనికితోడు పని ఒత్తిడి, ఖర్చులకు జడిసి చాలా మంది యువత పెళ్లిపై విముఖత చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు పిల్లల్ని కనడానికి తల్లిదండ్రులకు అనుమతినిచ్చేలా చైనా జాతీయ అసెంబ్లీ ఆగస్టులో చట్టాలను సవరించింది. పరిమితికి మించి సంతానాన్ని కనే వారిపై విధించే జరిమానాలను రద్దు చేసింది. అందుకు అనుగుణంగా 20కి పైగా ప్రావిన్సులు స్థానిక చట్టాల్లో మార్పులు చేశాయి. ముగ్గురు సంతానం దిశగా తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు వివిధ తాయిలాలను ప్రకటిస్తున్నాయి. బీజింగ్, సిచువాన్, జియాంగ్‌షీ లాంటి ప్రావిన్సులు పితృత్వ సెలవుల మంజూరు, మాతృత్వ సెలవుల పెంపు, వివాహానికి కోరినన్ని సెలవులు ఇవ్వడం లాంటి చర్యలు చేపట్టాయి. మరికొన్ని ప్రావిన్సులు పిల్లల పెంపకానికయ్యే ఖర్చులను భరించడం, వివిధ పన్నులను తగ్గించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయని అక్కడి మీడియా తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని