అమెరికాలో పరీక్షలు.. గుంటూరులో నిర్ధారణ

అమెరికాలో నిర్ధారణ కాని ఒక అరుదైన వ్యాధిని గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రి న్యూరాలజీ విభాగం వైద్యులు నిర్ధారించి ఔరా అనిపించారు. గతంలో శస్త్రచికిత్సల ద్వారా అవిభక్త కవలలను విడిదీసి ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ నాయుడమ్మ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. తాజాగా గుంటూరుకు చెందిన 25 ఏళ్ల యువకుడు

Updated : 11 Dec 2021 11:09 IST

సాప్ట్‌వేర్‌ ఇంజినీర్‌కు అరుదైన వ్యాధి

ఈనాడు-అమరావతి అమెరికాలో నిర్ధారణ కాని ఒక అరుదైన వ్యాధిని గుంటూరు ప్రభుత్వ బోధనాసుపత్రి న్యూరాలజీ విభాగం వైద్యులు నిర్ధారించి ఔరా అనిపించారు. గతంలో శస్త్రచికిత్సల ద్వారా అవిభక్త కవలలను విడిదీసి ఆసుపత్రికి చెందిన డాక్టర్‌ నాయుడమ్మ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. తాజాగా గుంటూరుకు చెందిన 25 ఏళ్ల యువకుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ చేతులు, కాళ్లు చచ్చుపడి నడవలేని స్థితిలో అమెరికా నుంచి రాగా, అతనికున్న వ్యాధిని న్యూరాలజీ విభాగాధిపతి ఆచార్య ఎన్‌.వి.సుందరాచారి, సహచర వైద్య బృందం శాస్త్రీయంగా నిర్థారించారు. ఆ యువకుడు ‘పాలియో సిండ్రోమ్‌’ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నారని గుర్తించారు. ఇది బ్లడ్‌ కేన్సర్‌ను పోలి ఉంటుందన్నారు. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల నుంచి ఇంటి నుంచే విధులు, బయటకు వచ్చే పరిస్థితి లేకపోవటం, ఎక్కువ సమయం పనిచేయటం వల్ల తనకు కాళ్లు, చేతులు పట్టేశాయని ఆ యువకుడు తొలుత అపోహ చెందాడు. కొన్నాళ్లకుపూర్తిగా చచ్చుపడి కూర్చొంటే లేవలేకపోవటం, లేస్తే కూర్చోలేకపోవటం వంటి సమస్యలు ఎదురవటంతో అమెరికాలో ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరాడు. వ్యాధి నిర్ధారణ కోసం అక్కడ ఎన్నో పరీక్షలు చేశారు. వ్యాధిని అంచనా వేయలేక వెన్నెముకలో ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని తేల్చారు. ఆ యువకుడిని జీజీహెచ్‌ వైద్యులు తొలుత కౌన్సెలింగ్‌ చేశారు. అతని కదలికలు పరిశీలించారు. వారం పాటు ఇన్‌పేషెంట్‌గా ఉంచుకుని ప్రతి కదలికను కేస్‌షీట్‌లో పొందుపరిచారు. చేతులు పైకి లేపలేకపోవటం, పొట్టలోకి నీళ్లు చేరటం, బొడ్డు ఉబకడం, చేతుల్లో కండ ఎండిపోయి చచ్చుపడి ఉండటం వంటివి అనుమానించి అందుకు సంబంధించిన కొన్ని పరీక్షలు చేసి రిపోర్ట్సు పరిశీలించారు. ‘ప్లాస్మా సెల్స్‌ నుంచి మైలోమా ప్రొటీన్‌ (ఎంప్రొటిన్‌) అధికంగా ఉత్పత్తి అవుతోందని గుర్తించారు. దీన్ని సంక్షిప్తంగా ఎంప్రొటిన్‌గా పిలుస్తారు. సహజంగా ఇది ఒక శాతం లోపు ఉండాలి. కానీ ఈ రోగిలో పది శాతానికి పైగా ఉంది. ఇది చాలా హానికరమని వైద్యులు తెలిపారు. ఎంప్రొటీన్‌ అనేది ఉండకూడదని, ఇది బ్లడ్‌ కేన్సర్‌కు సంకేతం. కీమో థెరఫి, మూలగ  శస్త్రచికిత్స (బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌) ద్వారా మాత్రమే దాన్ని నివారించగలమని చెప్పారు.

వారంలో నిర్ధారించాం
పరీక్షలు చేసేటప్పుడు పేషెంట్‌ కదులుతారు. బిగుసుకుపోతారు. ఇవి రిపోర్టులో పడతాయి. వాటిని మచ్చలుగా భావించి స్పయిరల్‌ కార్డ్‌కు సంబంధించిన సమస్యతో బాధపడుతున్నారని గుర్తించినట్లు భావించాం.  ఆరిపోర్టును రెండు, మూడు సార్లు ఎగ్జామిన్‌ చేసి మరోసారి పరీక్షలు చేయించి చూడగా అక్కడ నివేదికలో కొంత తేడా ఉంది. దాని నిర్దారణ కోసం లిటరేచర్‌ చూశాం. అది వెన్నుకు సంబంధించిన సమస్య కాదని ఒక అంచనాకు వచ్చాం. ఆ యువకుడికి 4-5 మిలియన్ల ఎర్ర రక్తకణాలు, 11 వేలకు పైగా తెల్ల రక్తకణాలు ఉన్నాయి. తెల్ల రక్త కణాలు 11 వేలు దాటితే ఇన్‌ఫెక్షన్‌ కేసుగా పరిగణిస్తాం. ఎంప్రొటిన్‌ అధికంగా ఉత్పత్తి కాకుండా కీమోథెరఫీ చేయాలి. ఇది అరుదైన కేసు. ప్రతి పది లక్షల్లో ముగ్గురుకు మాత్రమే వస్తుంది. 25 ఏళ్ల సర్వీసులో తొలిసారిగా ఇది చూశా. అమెరికా వైద్యులు చేసిన పరీక్షలు చాలా బాగున్నాయి. వారు అన్ని రకాల పరీక్షలు చేయించటం వల్లే త్వరగా గుర్తించాం. దీన్ని ఇటీవల గుంటూరు న్యూరోక్లబ్‌లో ప్రదర్శించాం. 
-ఆచార్య ఎన్‌.వి.సుందరాచారి, హెచ్‌ఓడీ, న్యూరాలజీ విభాగం,  జీజీహెచ్‌  

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని