వైఎస్‌ఆర్‌ చనిపోయినప్పుడు రోశయ్య బాధ అంచనా వేయలేనిది: కేవీపీ

50 ఏళ్ల రాజకీయ జీవితంలో అజాత శత్రువుగా పేరుపొందిన మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్యను నేటి తరం రాజకీయ నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలని ..

Updated : 15 Dec 2021 15:31 IST

జేఆర్‌సీ కన్వెన్షన్‌లో వైకుంఠ సమారాధన కార్యక్రమం.. పాల్గొన్న ప్రముఖులు

హైదరాబాద్‌: 50 ఏళ్ల రాజకీయ జీవితంలో అజాత శత్రువుగా పేరుపొందిన మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్యను నేటి తరం రాజకీయ నేతలు స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌ సెంటర్‌లో రోశయ్య వైకుంఠ సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీలకు చెందిన పలువురు సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రోశయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం రోశయ్య చేసిన సేవలను కొనియాడారు. 

రోశయ్య పాత్ర విలువలతో కూడుకున్నది: జానారెడ్డి

సమయస్ఫూర్తితో సమస్యల పరిష్కారంలో రోశయ్య దిట్ట అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి అన్నారు. నేటి రాజకీయ నేతలకు ఆయన జీవితం ఆదర్శమని చెప్పారు. రోశయ్య పోషించిన పాత్ర విలువలతో కూడుకున్నదని జానారెడ్డి కొనియాడారు. 

గొప్ప పాలనాదక్షుడు: రేవంత్‌రెడ్డి

చట్టసభల్లో మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య పోషించిన పాత్ర అందరికీ స్ఫూర్తిదాయకమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన గొప్ప పరిపాలనా దక్షుడని.. నేటి తరానికి, రాజకీయ నేతలకు ఆదర్శమని కొనియాడారు. సమస్యలను పరిష్కరించడంలో రోశయ్య ట్రబుల్‌ షూటర్‌గా పేరుగాంచారన్నారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతుండటంతో ఏఐసీసీ నుంచి ఈ కార్యక్రమానికి ఎవరూ రాలేకపోయారని చెప్పారు. రోశయ్య ఆశయాలకు అనుగుణంగా.. ఆయన స్ఫూర్తితో పనిచేస్తానని చెప్పారు. రోశయ్య జ్ఞాపకార్థం హైదరాబాద్‌ నడిబొడ్డున స్మృతివనం నిర్మించాలన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్‌ పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు.

రోశయ్య లేని లోటు పూడ్చడం కష్టం: రఘువీరా

రోశయ్యతో కలిసి పనిచేయడం తన అదృష్టమని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. ఆయన ఆశయాలు శాశ్వతంగా ఉండేలా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రోశయ్య లేని లోటు పూడ్చడం కష్టమని చెప్పారు. ఆయన ఆదర్శాలను అమలు చేయడానికి ప్రయత్నాలు చేయాలన్నారు.

సరళమైన భాషతో ప్రతిపక్షాలను ఇరుకున..: భట్టి 

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ రోశయ్య ఏ పక్షంలో ఉన్నా.. ఆ పక్షం గెలుపునకు పనిచేసేవారని చెప్పారు. సరళమైన భాషతో ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేవారని.. ఇప్పటి నేతలు మాట్లాడే భాష వింటే ఆయన బాధపడతారన్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కలగడం తన అదృష్టమన్నారు. ఆర్థికమంత్రిగా.. సంక్షేమ, అభివృద్ధి పనులకు నిధుల కొరత రాకుండా సర్దుబాటు చేసేవారని గుర్తు చేసుకున్నారు. 

నిధులు లేవు.. కొత్త పథకాలు వద్దన్నారు: కేవీపీ

రాజకీయాల్లో రోశయ్య పోషించిన పాత్ర ఇప్పటి నేతలకు ఆదర్శమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీపీ రామచంద్రరావు అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి (వైఎస్‌ఆర్‌) సీఎంగా ఉన్నప్పుడు ముఖ్య అధికార ప్రతినిధిగా ఆయన కీలకపాత్ర పోషించారని చెప్పారు. వైఎస్‌ఆర్‌ టూర్‌కు వెళుతున్న సమయంలో నిధులు లేవు.. కొత్త పథకాలు వద్దని వైఎస్‌తో చెప్పాలని తనకు చెప్పినట్లు కేవీపీ గుర్తుచేసుకున్నారు. అనంతరం రోశయ్యతో మాట్లాడి వైఎస్‌ ముందుకెళ్లారన్నారు. వైఎస్‌ఆర్‌ చనిపోయిన సమయంలో రోశయ్య పడిన బాధ, మనోవేదన అంచనా వేయలేనిదని చెప్పారు. 

పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు: అంబటి రాంబాబు

రోశయ్యలాంటి అరుదైన నాయకులు మరణించడం దురదృష్టకరమని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. రాజకీయంగా, కుటుంబపరంగా ఆయన పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారని చెప్పారు. రాజకీయ నేతల వద్దకు చాలా మంది వస్తుంటారు.. వారి సమస్య పరిష్కారం కాకపోతే ముందే చెప్పాలని.. తిప్పించుకోకూడదని తనకు సలహా ఇచ్చారని అంబటి చెప్పారు. పదవిలో ఉన్నా.. లేకపోయినా రోశయ్య ఒకేలా ఉన్నారన్నారు.

ఆర్థిక చాణక్యుడు: చాడ వెంకట్‌రెడ్డి

రోశయ్య ఏ పదవిలో ఉన్నా ఆ పదవికే వన్నె తెచ్చేవారని సీపీఐ నేత చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఆర్థికమంత్రిగా 15సార్లు బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక చాణక్యుడు ఆయన అని కొనియాడారు. రోశయ్య స్మృతివనం నిర్మించాలని తమ పార్టీ తరఫున కూడా  కేసీఆర్‌ను కోరతామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని