AP News: ఉన్నత పాఠశాలల్లో ఒకే మాధ్యమం

ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కలిపి ఒకే మాధ్యమంగా చూడాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. 

Updated : 16 Dec 2021 10:54 IST

తెలుగు మాధ్యమాన్ని మూసివేసేందుకు చర్యలు!
 ఫౌండేషన్‌ బడుల్లో 30 మందికి ఒక్కరే ఉపాధ్యాయుడు
 విలీన పాఠశాలల్లో సర్దుబాటుకు విద్యాశాఖ నిర్ణయం

ఈనాడు, అమరావతి: ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కలిపి ఒకే మాధ్యమంగా చూడాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకే మాధ్యమం పేరుతో తెలుగు మాధ్యమాన్ని మూసివేసేందుకు చర్యలు చేపట్టింది. ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీనం కారణంగా ఉపాధ్యాయులు కొరత ఏర్పడుతోంది. ఈ సమస్యను పరిష్కంచేందుకు రెండు మాధ్యమాలను ఒకే మాధ్యమంగా పరిగణిస్తూ అదనపు సెక్షన్లకు ఉపాధ్యాయులను ఇవ్వనున్నట్లు వెల్లడించింది. మాధ్యమంతో సంబంధం లేకుండా 3-10 తరగతులకు ప్రధానోపాధ్యాయుడు, పీఈటీతో కలిపి 9మంది ఉపాధ్యాయులను కేటాయించనున్నట్లు పేర్కొంది. ఇందుకనుగుణంగా ఉపాధ్యాయుల అవసరాలను గుర్తించాలని వెల్లడించింది. ప్రస్తుతం చాలా పాఠశాలల్లో తెలుగు, ఆంగ్ల మాధ్యమాలు ఉన్నాయి. ఒకే మాధ్యమంగా పరిగణించి హేతుబద్దీకరణ చేస్తే రెండింటిని కలిపి పాఠాలు ఎలా బోధిస్తారు? విద్యార్థులకు అవి ఎలా అర్థమవుతాయి? అని పలువురు ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. 3,4,5 తరగతుల విలీనానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. తరగతుల విలీనానికి ఇప్పటికే మ్యాపింగ్‌ పూర్తి చేసిన బడులను మరోసారి పరిశీలించాలని ఆదేశించింది. 

1,2 తరగతులకు కేటాయింపుల్లో మార్పు

ఫౌండేషన్‌ పాఠశాలల్లో 1,2 తరగతుల బోధనకు 30మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున కేటాయించనున్నారు. గతంలో 20 మందికి ఒక్కరు చొప్పున ఉండాలని పేర్కొనగా.. ఇప్పుడు దీన్ని 1:30కి పెంచారు. ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలిస్తే మిగిలే 1,2 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండే బడులు అధికంగా ఉన్నాయి. 30 మందికి ఒక్కరినే కేటాయిస్తే తక్కువ మంది ఉన్న చోట రెండు తరగతుల బోధనకు ఒక్కరే మిగులుతారు. 

* ఉన్నత పాఠశాలలకు 3,4,5 తరగతులను తరలించిన తర్వాత ప్రాథమిక బడిలో మిగిలే 1,2 తరగతుల బోధనకు అక్కడ ఉన్న అందరి కంటే జూనియర్‌ ఉపాధ్యాయులను కేటాయిస్తారు. మిగిలే ఉపాధ్యాయులతో పాటు ప్రధానోపాధ్యాయుడిని ఉన్నత పాఠశాలలకు అనుసంధానం చేస్తారు. 

ఉన్నత పాఠశాలల్లో 3-10 తరగతులకు ప్రధానోపాధ్యాయుడు, పీఈటీతో కలిపి తొమ్మిది మంది ఉంటారు. ఈ లెక్కన ఒక్కో స్కూల్‌ అసిస్టెంట్‌కు వారానికి 48 పీరియడ్స్‌ వరకు బోధించాల్సి వస్తుంది. తరగతులను సబ్జెక్టు ఉపాధ్యాయులతోనూ పునశ్చరణ, గ్రంథాలయం, ఆర్ట్, డ్రాయింగ్‌ వంటి తరగతులను సబ్జెక్టుతో సంబంధం లేకుండా వారు హాజరు కావాల్సి ఉంటుంది. 

అవసరమయ్యే ఉన్నత పాఠశాలలకు పని సర్దుబాటు కింద జిల్లా, మండలాల్లో మిగులు సిబ్బందిని కేటాయిస్తారు.

* ఒకే ప్రాంగణంలో ఉండే 1-10 తరగతులను తల్లిదండ్రుల కమిటీ తీర్మానంతో మిశ్రమ పాఠశాలగా మార్పు చేస్తారు.

ఉన్నత పాఠశాలల్లో తరగతి గదులు లేకపోతే 3,4,5 తరగతులను ప్రాథమిక పాఠశాలల్లోనే నిర్వహిస్తారు. ఉన్నత పాఠశాలలకు చెందిన సబ్జెక్టు ఉపాధ్యాయులు వెళ్లి తరగతులు తీసుకుంటారు. ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షణ చేస్తారు.

ఆ ఫర్నీచర్‌ ఏం చేస్తారు?

రాష్ట్రంలో కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో ‘నాడు-నేడు’ కింద మౌలిక సదుపాయాలు కల్పించారు. విద్యార్థులకు బెంచీలను సరఫరా చేశారు. ఇప్పుడు 3,4,5 తరగతులకు సంబంధించిన ఫర్నీచర్‌ను మాత్రం తరలించడం లేదు. ఉన్నత పాఠశాలల్లో ఫర్నీచర్‌ సమస్య ఏర్పడుతోంది. కొన్నిచోట్ల బాలికల ఉన్నత పాఠశాలల్లోనూ 3,4,5 తరగతులను విలీనం చేశారు. ఇలాంటి చోట్ల అబ్బాయిలకు మరుగుదొడ్ల సమస్య ఏర్పడుతోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని