TS News:డిస్కంల లోటు రూ.26,665 కోట్లు

‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’(డిస్కం)ల ఆదాయ, వ్యయాల మధ్య అంతరం భారీగా పెరుగుతోంది. గత మూడేళ్లలో కరెంటు సరఫరాకు చేసిన

Published : 22 Dec 2021 11:08 IST

బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వానికి వినతి

హైదరాబాద్‌: ‘విద్యుత్‌ పంపిణీ సంస్థ’(డిస్కం)ల ఆదాయ, వ్యయాల మధ్య అంతరం భారీగా పెరుగుతోంది. గత మూడేళ్లలో కరెంటు సరఫరాకు చేసిన వ్యయంతో పోలిస్తే ఆదాయం రూ.26,665 కోట్లు తక్కువగా వచ్చిందని తాజాగా డిస్కంలు నిర్ధారించాయి. ఈ లోటు పూడ్చుకునేందుకు నిధులివ్వాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఒక ఆర్థిక సంవత్సరం పూర్తయిన తరవాత ఆదాయ, వ్యయాల మధ్య అంతరం ఎక్కువగా ఉంటే విద్యుత్‌ చట్టం ప్రకారం ఈ లోటు పూడ్చుకునేందుకు ‘ట్రూఅప్‌’ పేరుతో సర్‌ఛార్జీ వసూలుకు అనుమతించాలని డిస్కంలు ‘రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి’(ఈఆర్‌సీ)కి ఏటా నవంబరు 30కల్లా ప్రతిపాదనలు ఇవ్వాలి. గత మూడేళ్లుగా ఈ ప్రతిపాదనలేమీ ఇవ్వలేదు. ఈ ఏడాది(2021-22) రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.10,500 కోట్లను విద్యుత్‌ రాయితీల కింద కేటాయించింది. అవి సరిపోకపోవడంతో మరో రూ.10,624 కోట్ల లోటు ఏర్పడనుందని తాజాగా డిస్కంలు నిర్ధారణకు వచ్చాయి. వీటితో కలిపి మూడేళ్ల(2019-22)లోటు రూ.26,665 కోట్లకు చేరనుందని తాజా అధ్యయనంలో గుర్తించాయి. వచ్చే ఏడాది మరో రూ.10,928 కోట్ల లోటు(ప్రభుత్వం ఇచ్చే రాయితీపోను) ఏర్పడుతుందని లెక్కించాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఏడాది బడ్జెట్‌ కేటాయింపులు గణనీయంగా పెంచాలని, లేనిపక్షంలో ఛార్జీల పెంపు అనివార్యమని డిస్కంలు తాజాగా ప్రభుత్వానికి తెలిపాయి. ఛార్జీలు పెంచడానికి అనుమతించాలని ప్రభుత్వాన్ని అడగగా, ఎంత పెంచాలనే దానిపై వర్గాల వారీగా లెక్కలు వేసి ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ప్రజలపై ఎక్కువ భారం పడకుండా చూడాలని చెప్పినట్లు తెలిసింది.

తెలంగాణలో విద్యుత్తు నష్టం 21.54%
తెలంగాణలో విద్యుత్తు సరఫరా తాలూకూ సాంకేతిక, వాణిజ్య నష్టాలు యేటా పెరుగుతున్నట్టు కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్‌కేసింగ్‌ తెలిపారు. 2015-16లో 14.01 శాతంగా ఉన్న నష్టాలు 2019-20 నాటికి 21.54 శాతానికి చేరినట్టు మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ సభ్యుడు కేసీ వేణుగోపాల్‌ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని