Hyderabad News: ఇకపై ఆన్‌లైన్‌లోనే నీటి బిల్లులు!

నీటి బిల్లుల జారీ... చెల్లింపుల్లో పారదర్శకతపై జలమండలి దృష్టిసారించింది. ఇక ఇంటింటికి, అపార్ట్‌మెంట్‌కు, పరిశ్రమల వద్దకు వెళ్లి బిల్లులు జారీ చేసే విధానానికి స్వస్తి పలకనుంది.

Updated : 23 Dec 2021 09:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: నీటి బిల్లుల జారీ... చెల్లింపుల్లో పారదర్శకతపై జలమండలి దృష్టిసారించింది. ఇక ఇంటింటికి, అపార్ట్‌మెంట్‌కు, పరిశ్రమల వద్దకు వెళ్లి బిల్లులు జారీ చేసే విధానానికి స్వస్తి పలకనుంది. బిల్లుల జారీ నుంచి..వసూలు వరకు పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ విధానంలో చేయనున్నారు. జలమండలి డివిజన్‌ కార్యాలయాల వద్ద నగదు చెల్లింపులు, చెక్కులు తీసుకోవడం తదితర విధానాలు మున్ముందు అందుబాటులో ఉండవు. తొలుత వాణిజ్య నల్లాలకు జనవరి 1వ తేదీ నుంచి ఈ ప్రక్రియ అమల్లోకి రానుంది. ఏప్రిల్‌ 1 నుంచి పూర్తి స్థాయిలో ఈ విధానం చేపట్టనున్నట్లు జలమండలి ఎండీ దానకిషోర్‌ తెలిపారు. ఖైరతాబాద్‌ జలమండలి ప్రధాన కార్యాలయంలో సీజీఎంలు, జీఎంలతో రెవెన్యూ అంశాలపై బుధవారం ఆయన సమీక్షించారు. ఆన్‌లైన్‌ విధానంలో బోర్డు ఆదాయం పెరగడంతోపాటు మోసాలకు కూడా అడ్డుకట్ట పడనుంది. గ్రేటర్‌ వ్యాప్తంగా 12 లక్షల నల్లాలు ఉన్నాయి. ఇందులో 70 శాతం నల్లాలు గృహాలకు సంబంధించినవి. వీటి నుంచి రూ.36 కోట్లు వరకు ఆదాయం వస్తోంది. వాణిజ్య నల్లాల నుంచి రూ.70-80 కోట్లు ఆదాయం సమకూరుతోంది. ప్రతి వాణిజ్య నల్లాకు మీటర్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎండీ ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని