
Online Classes: ప్రపంచమే తరగతి గది:భవిష్యత్తులో తీరు మారనున్న పాఠశాల విద్య
పిల్లల సామర్థ్యాలు-ఆసక్తి కేంద్రంగా పాఠ్య ప్రణాళిక
నచ్చిన బడి, ఉపాధ్యాయుల వద్ద చేరవచ్చు
కన్సాస్: కరోనా మహమ్మారి దాదాపు ప్రతి వ్యక్తిపైనా, ప్రతి రంగంపైనా ప్రభావం చూపింది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు పునాదిగా భావించే పాఠశాల స్థాయి విద్యలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. భౌతిక తరగతులు దూరమై, ఆన్లైన్ బోధన నేరుగా ఇంట్లోకే వచ్చేసింది. పిల్లలు షెడ్యూలు ప్రకారం తరగతులు వినేలా తల్లిండ్రులు వారిని పర్యవేక్షించాల్సి వస్తోంది. ఉపాధ్యాయులు కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని కొత్త బోధనా విధానాలకు అలవాటు పడుతున్నారు. ఎప్పటికప్పుడు కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న క్రమంలోనే కొత్త పరికరాలు, సాంకేతికతలు, పరిశోధనలతో ఆన్లైన్ బోధన రంగం పరిపుష్టం అవుతున్నాయి. వీటి కారణంగా భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా పాఠశాల విద్యలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందంటున్నారు... అమెరికాలోని కన్సాస్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధనకర్త యాంగ్ ఝావో. పాఠ్య ప్రణాళిక ఆధారంగా కాకుండా... విద్యార్థి సామర్థ్యాలు, ఆసక్తి ఆధారంగా వ్యక్తిగత పాఠ్య ప్రణాళికలను రూపొందించి, బోధించేందుకు త్వరలోనే ఆన్లైన్ ద్వారాలు తెరుచుకుంటాయని పేర్కొన్నారు.
ఇలా ఉండాలి పాఠ్య ప్రణాళిక..
విద్యార్థులు తమకు ఇష్టమైన రంగాల్లో రాణించేలా పాఠ్య ప్రణాళికను ఎలా రూపొందించాలన్న దానిపై యాంగ్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘విద్యార్థి సామర్థ్యాలు, ఆసక్తి కేంద్రంగా పాఠశాలలు వ్యక్తిగత పాఠ్య ప్రణాళిక రూపొందించాలి. దీన్ని మూడు విభాగాలుగా చేయాలి. 1) దేశం, రాష్ట్రాలకు సంబంధించిన పాఠాలు 2) పాఠశాల కేంద్రీకృత పాఠ్యాంశాలు 3) విద్యార్థి సామర్థ్యాలు, ఆసక్తి కేంద్రంగా పాఠ్యాంశాలు. తొలి రెండు విభాగాల అంశాలను అందరికీ సమానంగా బోధించవచ్చు. మూడో విభాగానికి వచ్చేసరికి... విద్యార్థులను తరగతుల వారీగా కాకుండా, వారు ఎంపిక చేసుకున్న పాఠ్యాంశాల వారీగా కూర్చోబెట్టాలి. తద్వారా వారిలో సృజనాత్మకత, నైపుణ్యాలు, ఆసక్తి పెరుగుతాయి. ఒకరి నుంచి ఒకరు కొత్త విషయాలు తెలుసుకుని తమకు ఆసక్తి ఉన్న రంగాల్లో అత్యంత సహజసిద్ధంగా, ఒత్తిడి రహితంగా, పోటీ తత్వంతో నైపుణ్యాలను సాధించే అవకాశం ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
ఏ దేశం నుంచైనా..
దూరం నుంచి నేర్చుకునే (రిమోట్ లెర్నింగ్) విధానంలో విద్యార్థులు భౌతిక తరగతులకు హాజరు కావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి, దేశంలోని ఇతర ప్రాంతాలు, విదేశాలకు చెందిన పాఠశాలలు, ఉపాధ్యాయుల వద్ద చేరి, తమకు నచ్చిన పాఠ్యాంశాలను విద్యార్థులు నేర్చుకునే అవకాశం ఉంటుంది. భారత్లోని విద్యార్థి బ్రిటన్ బడిలో చేరవచ్చు. అమెరికాలోని తెలుగు పిల్లలు ఇండియాలోని బడుల్లో చేరవచ్చు. తమకు ఇష్టమైన సబ్జెక్టులను నచ్చిన బడి, ఉపాధ్యాయుల నుంచి నేర్చుకునే అవకాశం దరిచేరితే... విద్యార్థుల్లో ఆసక్తి, ప్రతిభ పెరుగుతాయి. భవిష్యత్తులో వారు ఆయా రంగాల్లో నిపుణులుగా, వ్యాపారవేత్తలుగా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది’’ అని కన్సాస్ వర్సిటీ అధ్యయనకర్తలు అభిప్రాయపడ్డారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.