TS News: ఇప్పపువ్వు లడ్డూతోరక్తహీనతకు అడ్డు.. అతివల కోసం వినూత్న యత్నం

సహజసిద్ధంగా లభించే వనరులతో తయారుచేసిన ఇప్పపువ్వు లడ్డూతో ఏజెన్సీలో ప్రభుత్వ యంత్రాంగం

Updated : 01 Jan 2022 09:54 IST

ఆసిఫాబాద్‌: సహజసిద్ధంగా లభించే వనరులతో తయారుచేసిన ఇప్పపువ్వు లడ్డూతో ఏజెన్సీలో ప్రభుత్వ యంత్రాంగం 2021లో చేపట్టిన ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తోంది. కాబోయే అమ్మకు అండగా నిలుస్తూ.. యుక్త వయసు బాలికల్లో పోషకలేమిని తగ్గిస్తోంది.

సర్వేలో గుర్తించి.. ప్రణాళికలు రూపొందించి
ఉమ్మడి జిల్లా జనాభాలో సగం మంది మహిళలే. రక్తహీనతతో బాధపడేది కూడా వారే. జాతీయస్థాయిలో రక్తహీనతతో బాధపడే మహిళలు 56 శాతం ఉంటే తెలంగాణలో 60 శాతం ఉన్నట్లుగా ఇటీవల ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్ఛ్‌ ఆధ్వర్యంలో జాతీయ పోషక ఆహార సంస్థ సర్వేలో వెల్లడైంది. ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌ మండలం, కుమురం భీం జిల్లాలోని జైనూర్‌ మండలంలో వంద మంది గర్భిణుల చొప్పున పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా సర్వే నిర్వహించగా.. వీరిలో చాలా మందికి సాధారణంగా ఉండాల్సిన 11 శాతం హెమోగ్లోబిన్‌ ఏజెన్సీ ప్రాంత గర్భిణుల్లో కేవలం 6 నుంచి 7 శాతం ఉంటున్నట్లు సర్వేలో తేలింది. యుక్త వయసు బాలికల్లోనూ రక్తహీనత ఉన్నట్లు నిర్ధారణ అయింది. సరైన భోజనం తీసుకోకపోవడంతో వచ్చే పోషకాహారలేమి, అవగాహన లోపం, ఆధునిక వైద్యానికి దూరంగా ఉండటం ప్రధాన కారణాలుగా సర్వేలో తేలింది. దీన్ని అధిగమించేందుకు ఉమ్మడి జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. 

మూడు నెలలు.. క్రమం తప్పకుండా..
ఉమ్మడి జిల్లా ఏజెన్సీ పరిధిలోని 31 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో మార్పును తీసుకొచ్చేందుకు జాతీయ పోషకాహార సంస్థ డిప్యూటీ డైరెక్టర్‌ డా.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ కేంద్రంగా అధ్యయనం కొనసాగుతోంది. ఇప్పటికే ప్రతి గర్భిణితో పాటు రక్తహీనతతో బాధపడే యుక్త యవసున్న ఆడపిల్లలకు రోజుకో 25 గ్రాములతో కూడిన ఇప్పపువ్వు లడ్డు అందించే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ప్రతి ఆరు నెలలకోసారి రక్త పరీక్షలు చేస్తున్నారు. మూడు నెలలుగా ఇప్పపువ్వు లడ్డులు క్రమం తప్పకుండా తీసుకున్న వారిలో 6 శాతం ఉన్న హెమోగ్లోబిన్‌ దాదాపుగా 9 శాతానికి చేరుకున్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అన్ని పీహెచ్‌సీల్లో అత్యవసర పరిస్థితుల్లో అందించడానికి ఐరన్‌ సుక్రోజ్‌ ఇంజెక్షన్లు, ప్రతి ఏఎన్‌ఎం దగ్గర ఐరన్‌ ఫోలిక్‌ మాత్రలను యంత్రాంగం అందుబాటులో ఉంచుతోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణులు, చిన్నారులకు పోషకాహారంతో కూడిన భోజనం వడ్డించే ప్రయత్నం కొనసాగుతుండటంతో ఏజెన్సీలో మార్పు కనిపిస్తోంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని