Harassment:భద్రత కొరవడి.. వేధింపుల అలజడి..!

ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని వేధింపులకు గురవడంతో అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ)కి ఫిర్యాదు చేశారు.

Published : 05 Jan 2022 09:34 IST

మహిళా ఉద్యోగులకు పని ప్రాంతాల్లో రక్షణ కరవు

సంస్థల్లో నామమాత్రంగా అంతర్గత ఫిర్యాదుల కమిటీలు

హైదరాబాద్‌ : ప్రభుత్వ  రంగ సంస్థలో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని వేధింపులకు గురవడంతో అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ)కి ఫిర్యాదు చేశారు. సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవాల్సిన ఆ సంస్థ.. బాధితురాలినే వేరే చోటుకి బదిలీ చేసింది. పైగా.. ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు చేపట్టకుండానే వేధింపులు జరగలేదంటూ ఐసీసీ విచారణను ముగించింది. విషయం తెలుసుకున్న బాధితురాలు ఉన్నతాధికారులు, మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేశారు. చివరకు శిశు సంక్షేమ శాఖ అధికారులు ఆ సంస్థను హెచ్చరిస్తూ లేఖ రాశారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సంస్థ ఐసీసీ విచారణకు అంగీకరించింది. న్యాయం కోసం ఓ మహిళ 20 ఏళ్లుగా చేస్తున్న పోరాటమిది..

మహిళలకు పని ప్రదేశాల్లో రక్షణ కొరవడుతోంది. కొందరు సహ ఉద్యోగులు, అధికారులు వారిని మానసిక, లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారు. రాష్ట్రంలో ఈ తరహా కేసులు నమోదవుతున్నా.. బాధితులకు సరైన న్యాయం జరగడం లేదు. పరువు పోతుందన్న ఉద్దేశంతో కొందరు బాధితులు ఫిర్యాదులకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య పది మందికి మించితే అంతర్గత ఫిర్యాదుల కమిటీ(ఐసీసీ)లను నియమించాలి. మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేసిన వెంటనే ఆ కమిటీ విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 వేలకు పైగా సంస్థల్లో ఐసీసీలు ఏర్పాటయ్యాయి. సంస్థల్లో కమిటీలు లేకుంటే జిల్లా స్థాయుల్లోని స్థానిక ఫిర్యాదుల కమిటీ(ఎల్‌సీసీ)ని ఆశ్రయించొచ్చు. ఇదిలా ఉండగా.. ఐసీసీకి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని, కేసులు నమోదవలేదని కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రభుత్వానికి నివేదికలు అందిస్తుండటం గమనార్హం. ఫిర్యాదులు వచ్చినా అంతర్గతంగా రాజీ చేసి, పోలీసు కేసుల వరకు వెళ్లకుండా కొన్ని సంస్థలు జాగ్రత్త పడుతున్నాయి.


మూడేళ్లుగా అడుగుపడని ‘టీ-షీ బాక్స్‌’
పని ప్రదేశాల్లో వేధింపులను నివారిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ‘టీ-షీ బాక్స్‌’ను అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం మూడేళ్ల క్రితం నిర్ణయించింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ ఆధ్వర్యంలో దీనికోసం ప్రత్యేక వెబ్‌సైట్, మొబైల్‌ యాప్‌ తీసుకురావాలని భావించింది. ఈ ప్రతిపాదన ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఇది త్వరితగతిన ఏర్పాటైతే పని చేసే చోట వేధింపులకు గురవుతున్న మహిళలకు న్యాయం దక్కుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

255 కేసుల పరిష్కారం..
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ ఏడాది తెలంగాణ మహిళా కమిషన్‌కు 466 ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై విచారణ నిర్వహించిన కమిషన్‌ 255 కేసులను పరిష్కరించి, బాధితులకు న్యాయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. మరో 211 కేసులు విచారణలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని