ఓ ప్రవాసుడా.. ప్రియ భారత పుత్రుడా..!!

పుట్టినగడ్డపై కరోనా కరాళ నృత్యం.. ఖండాంతరాలు దాటిన నీకు కన్నీటి సముద్రమైంది.. అనాథలైన చిన్నారుల ఆర్తనాదాలు.. మీలో సేవా ఆర్తిని తట్టిలేపింది.. ఎర్రటి ఎండలో వలస కూలీ కాలి బొబ్బలతో నీ

Updated : 09 Jan 2022 08:30 IST

కరోనా కాలంలో పేదలకు చేయూత

నేడు దినోత్సవం

మహబూబాబాద్‌, కాజీపేట, ఎంజీఎం ఆసుపత్రి, న్యూస్‌టుడే

ప్రవాసుడా.. మీ సేవ అజరామరం!

పుట్టినగడ్డపై కరోనా కరాళ నృత్యం.. ఖండాంతరాలు దాటిన నీకు కన్నీటి సముద్రమైంది.. అనాథలైన చిన్నారుల ఆర్తనాదాలు.. మీలో సేవా ఆర్తిని తట్టిలేపింది.. ఎర్రటి ఎండలో వలస కూలీ కాలి బొబ్బలతో నీ మనస్సు వెన్నయింది.. ఆకలితీరిన డొక్కల ఆశీర్వాదాలు.. నీకు చిన్ననాట అమ్మ పాడిన లాలిపాటైంది.. కష్టకాలంలో నీవు చూపిన జాలి కలకాలం నిలిచే ఉంటుంది.. వెన్నుచూపకుండా చేసిన సాయం చిరస్థాయిగా గుర్తుండిపోతుంది..

పేదలకై పరితపించే హృదయం ఉన్న వాడినే మహాత్ముడు అని నేను అంటాను. అది లోపిస్తే వాడు దురాత్ముడే - స్వామి వివేకానంద

ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి దాదాపు 25 వేల మంది వివిధ దేశాల్లో స్థిరపడ్డారు.

కొవిడ్‌ కాలంలో పేద కుటుంబాలకు అండగా ఉంటూ జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రవాస భారతీయులు. తమ బంధువులు, స్నేహితులు, స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇతోధికంగా సేవలందించారు. ఈ సేవా పరంపరను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. తాము రాలేకపోయినా.. తమ సేవలు పేదలకు అందాలనే సంతృప్తితో అనేక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.


సి-ఆర్మ్‌ యంత్రాన్ని అందజేస్తున్న ప్రవాసభారతీయ వైద్యుల బృందం సభ్యుడు,

కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ డాక్టర్‌ దేవులపల్లి ప్రవీణ్‌కుమార్‌

కేఎంసీ డాల్విన్స్‌ బ్యాచ్‌ దొడ్డ సాయం

వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీ 1986 డాల్పిన్స్‌ బ్యాచ్‌కు చెందిన వైద్యవిద్యార్థులు ఉమామహేశ్వర్‌, వాసవి, రాజేశ్‌, పోని, మంజుశ్రీ, గౌతిమి అనుపమ, అన్నపూర్ణ, నవీన, వాణిశ్రీ, విశ్వజ్యోతి, పద్మజారెడ్డి, అనుపమ, విశాల్‌ ఆద్మ, వినోద్‌మిర్యాల, వేణుపల్లా, పంంజిత్‌సింగ్‌చావ్లా, శ్రీనివాసన్‌, అజిత్‌చల్లా, సుజాత, పద్మజ. ప్రస్తుతం వీరంతా వివిధ హోదాల్లో అమెరికాలో వైద్యవృత్తిలో ఉన్నారు. తాము చదువుకున్న ఎంజీఎం ఆసుపత్రికి దో ఒకటి చేయాలనున్నారు. తమ బ్యాచ్‌మెటు ఒకరు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా కొనసాగుతున్న డాక్టర్‌ దేవులపల్లి ప్రవీణ్‌కుమార్‌ ద్వారా గతేడాది కొవిడ్‌ సమయంలో ఎంజీఎం ఆసుపత్రికి వైద్యపరికరాలు అందించారు. రెండోదశ కొవిడ్‌లో కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు, మంత్రి ఎర్రబెల్లి చేతుల మీదుగా ఎంజీఎం ఆసుపత్రికి రూ.22 లక్షల విలువైన పది బైపాప్‌ యంత్రాలు, 50 బిపాప్‌ మాస్కులు, 123 ఆక్సిజన్‌ ఫ్లోమీటర్లు, 10మల్టీ ఛానల్స్‌ మానిటర్లు, 350పీీపీీఈ కిట్లు, చేతితొడుగులు, ఎన్‌-95 మాస్కులు అందించారు.

* గతేడాది ఎంజీఎం ఆసుపత్రి ఆర్థో విభాగానికి 25 లక్షల విలువైన సి-ఆర్మ్‌ యంత్రాన్ని ప్రవాస వైద్యులు అందించిన సాయంతో డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ అందించారు.

దత్తత తీసుకొని వైద్యసేవలందిస్తూ

వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీలో చదువుకొని ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన నర్సంపేటకు చెందిన డాక్టర్‌ సురేశ్‌రెడ్డి తన కన్నఊరున మరవలేదు. అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌(ఏఏపీఐ) ద్వారా అందులో ఉన్న తెలంగాణలోని సుమారు 15 మంది వైద్యులతో దేశంలోని పేదలకు ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించారు. గ్లోబల్‌ టెలిక్లినిక్స్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గుజరాత్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని గ్రామాలను దత్తత తీసుకొని వైద్యసేవలను అందిస్తున్నారు. ఇప్పటి వరకు 5 రాష్ట్రాల్లోని 75 గ్రామాల్లో 15వేల మందికి వైద్యపరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించారు. అందులో భాగంగా తెలంగాణలోని 15గ్రామాల్లో ఈసేవలను అందిస్తున్నారు. డాక్టర్‌ సురేశ్‌రెడ్డి తన స్వగ్రామమైన నర్సంపేటను దత్తత తీసుకొని క్లినిక్‌లు నిర్వహించి ప్రజలకు ఉచిత వైద్యసేవలను అందిస్తున్నారు.

ఏ దేశమేగిన, ఎందుకాలిడినా..

ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనిన..

పొగడరా ! నీ తల్లి భూమి భారతిని

నిలుపరా ! నీ జాతి నిండు గౌరవము.


అనుపమ గొట్టిమూకల

రూ.37 కోట్ల విరాళాలు

హనుమకొండకు చెందిన అనుపమ గొట్టిమూకల చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌ ఆఫ్‌ శాన్‌ ఆంటారియోలో మత్తు వైద్యురాలిగా పని చేస్తున్నారు. అమెరికాలోని వైద్య సంఘం అమెరికన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజీషియన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ (ఆపీ) అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. వరంగల్‌ ఎంజీఎంతో పాటు తెలంగాణలోని పలు ఆసుపత్రులకు రూ.37 కోట్ల విరాళాలు అందించారు. 2,270 ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లు, వంద వరకు వెంటిలేటర్లు, ఆక్సిజన్‌ ఫ్లో మీటర్లు ఇతర వైద్య పరికరాలు వితరణ చేశారు. 400 మంది ఆపీ వైద్యులతో భారతదేశంలోని రోగులకు టెలీ హెల్త్‌ సేవలు అందించారు.


జిల్లా ఆసుపత్రికి రూ.20.86 లక్షల వైద్య పరికరాలు..

 

మహబూబాబాద్‌ జిల్లా ఆసుపత్రిలోని కొవిడ్‌ విభాగంలో అదనపు మంచాల ఏర్పాటుకు ఆస్ట్రేలియాలో ఉంటున్న ప్రేమ్‌చంద్ర, పూర్ణిమామీనన్‌ రూ.20.86 లక్షలను సమకూర్చారు. విశ్రాంత ఐఏఎస్‌ అధికారి తేజావత్‌ రాంచంద్రూనాయక్‌ ప్రోత్సాహంతో 40 మంచాలు, 40 ఐవీ సెట్స్‌, 35 మల్టీ పారామానిటర్స్‌ మరికొన్ని పరికరాల ఆసుపత్రికి అందజేశారు.

 


మానుకోట ఎన్నారైల అసోసియేషన్‌తో సేవలు..

జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది ప్రవాసభారతీయులు ‘మానుకోట ఎన్నారైల అసోసియేషన్‌’గా ఏర్పాటయ్యారు. ‘నిర్మాణ్‌’ సంస్థ ద్వారా రూ.20 లక్షల విరాళాల జిల్లా ఆసుప్రతిలో మహిళల విభాగంలో పది పడకలతో ఐసీయూ కేంద్రం ఏర్పాటు చేశారు. వెంటిలేటర్లు, పల్స్‌ ఆక్సోమీటర్లు, పేరా మానిటర్‌ సెక్షన్‌ ఆపరేటర్లు, సిలిండర్లు, ఇన్‌ఫ్యూజియన్‌ పంప్స్‌, సీలింగ్‌ ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. వీరికి పట్టణ సమీప గ్రామానికి చెందిన తిరుపతిరెడ్డి ఎర్రంరెడ్డి, శ్రీని వెన్నం, శ్రీనివాసరెడ్డి రామసహాయం సహకారమందించారు.


గూడూరు సీహెచ్‌సీలో 10 పడకలతో..

ఏజెన్సీ గిరిజనులకు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు వెంకీ హరినారాయణ్‌ అనే ప్రవాస భారతీయుడు సొంతంగా రూ.30 లక్షలతో పది పడకల ఐసీయూ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఆ మంచాలకు పల్స్‌ ఆక్సోమీటర్లు ఏర్పాటు చేశారు


వలసకూలీలకు నిత్యావసరాలు అందిస్తున్న మండువ సంతోష్‌

60 మంది స్నేహితులతో కలిసి..

వరంగల్‌ నగరంలోని సులక్ష్య సేవా సమితి నిర్వాహకుడు మండువ సంతోష్‌ 60 మంది ప్రవాస స్నేహితులతో ఇప్పటివరు సుమారు 2000 మంది కుటుంబాలకు నిత్యావసరాలు, 1500 మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు సేఫ్‌ ఎనర్జీ కిట్స్‌, 3000 మంది వలస కార్మికులకు కొవిడ్‌ కిట్‌లు, రైళ్లలో ప్రయాణం చేసే శ్రామిక వర్గాలకు అవసరమైన ఆహారం కల్పించారు. రోడ్డు, రైలు పట్టాల వెంబడి నడిచి వచ్చే 250 మంది వలస కార్మికులకు రవాణా సౌకర్యం కల్పించి వాళ్ల రాష్ట్రం చేర్చారు. ప్రవాస భారతీయుల సహకారంతోనే ఈ సేవ చేయగలిగానని ఆ ఘనత వారికే దక్కుతుందని మండువ వివరించారు.


 

 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts