AP News: బెజవాడలో బ్లేడ్‌బ్యాచ్‌ ఆగడాలు

ఒక వ్యక్తి పనిమీద ద్విచక్రవాహనంపై సత్యనారాయణపురం వెళ్తుండగా అడ్డంగా వచ్చిన వ్యక్తి బ్లేడుతో 

Updated : 09 Jan 2022 13:50 IST

ఈనాడు, అమరావతి

* ఒక వ్యక్తి పనిమీద ద్విచక్రవాహనంపై సత్యనారాయణపురం వెళ్తుండగా అడ్డంగా వచ్చిన వ్యక్తి బ్లేడుతో గాయపర్చి పర్సు లాక్కొని పరారయ్యారు. అతన్ని స్థానికులు చుట్టిముట్టగా నున్న చెరువులో దిగి ముప్పుతిప్పలు పెట్టారు. ఎట్టకేలకు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఆ వ్యక్తి బ్లేడ్‌బ్యాచ్‌ గ్యాంగ్‌ సభ్యుడు. రౌడీషీట్‌ ఉంది. అతని మీద 20కి పైగా కేసులు ఉన్నాయి. 

* సింగ్‌నగర్‌ పైపుల రహదారిలో దుర్గాబార్‌ వద్ద కొంతమంది బ్లేడ్లతో దాడి చేసుకున్నారు. ఒక వ్యక్తి మృతి చెందగా ముగ్గురు తీవ్ర గాయాలయ్యాయి. వీరు బ్లేడ్‌ బ్యాచ్‌కు చెందిన వారే. చిట్టినగర్‌ సొరంగం రోడ్డులో ఒక బార్‌లోనూ ఘర్షణ జరిగింది. బ్లేడ్లతో దాడి చేసి భయభ్రాంతులను చేశారు. పోలీసులు రావడంతో బ్లేడ్‌ బ్యాచ్‌ వ్యక్తి తన తలను బైక్‌కు కొట్టుకొని తీవ్రంగా గాయపర్చుకున్నాడు. 

* బ్లేడ్‌బ్యాచ్‌ ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాడనే అనుమానంతో ఓ యువకుడి గొంతు కోసి హత్య చేశారు.

ఇవీ వారి అడ్డాలు..!

ఒకటో పట్టణం, సింగ్‌నగర్, నున్న ఏరియా బ్లేడ్‌బ్యాచ్‌కి అడ్డాగా మారాయి. గంజాయి సేవిస్తూ.. మత్తులో జోగే వీరు ఏ క్షణం ఎవరిమీద దాడి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వీరికి కొంతమంది స్థానిక నేతల అండదండలు ఉన్నట్లు తెలిసింది. కొత్తపేట, నెహ్రూ బొమ్మ, పాలఫ్యాక్టరీ ఏరియా, చనుమోలు పైవంతెన, తారాపేట, కాళేశ్వరరావు మార్కెట్, రైల్వే ట్రాక్, వారధి ఏరియా, బస్టాండ్‌ ఏరియాలలో బ్లేడ్‌ ముఠాలు ఉనికిని చాటుతున్నాయి. సింగ్‌నగర్‌ , పడవలరేవు, వాంబేకాలనీ, సత్యనారాయణపురం ఆగడాలు ఎక్కువయ్యాయి. నున్న పరిధిలోని బ్లేడ్‌ బ్యాచ్‌ దాడుల్లో వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు మరణించారు. గత ఏడాది కమిషనరేట్‌ పరిధిలో గాయపడిన సంఘటనల కేసులు 486 నమోదు అయ్యాయి. వీటిలో సగానికి పైగా బ్లేడ్‌ బ్యాచ్‌లే ఉన్నాయి. గంజాయి కేసులు 145 నమోదు అయ్యాయి. 1521 కేజీల గంజాయి లభ్యమైనట్లు కేసులు నమోదు చేశారు. కానీ సేవిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడం లేదు. బ్యాచ్‌ సభ్యులు సాధారణ గడ్డం చేసుకునే బ్లేడ్‌తో పాటు.. యాక్సా బ్లేడులను వినియోగిస్తున్నారు. 

మార్పు తెస్తాం: సీపీ కాంతిరాణా టాటా

 బ్లేడ్‌బ్యాచ్‌ సభ్యుల్లో మార్పు తీసుకువచ్చేందుకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నాం. నగరంలో మొత్తం మీద సుమారు 150 మంది వరకు ఉండవచ్చు. మార్పుతెచ్చి ఉపాధి అవకాశాలు కల్పించే మార్గం  చూస్తున్నాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని