Corona Virus: స్మార్ట్‌ఫోన్‌ యాప్‌తో వేగంగా కొవిడ్‌ నిర్ధారణ

కరోనా వైరస్‌ను వేగంగా గుర్తించడానికి అమెరికా శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు.

Published : 03 Feb 2022 02:37 IST

లాస్‌ ఏంజిలెస్‌: కరోనా వైరస్‌ను వేగంగా గుర్తించడానికి అమెరికా శాస్త్రవేత్తలు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇందులో స్మార్ట్‌ఫోన్‌ యాప్, పరీక్ష కిట్‌ ఉంటాయి. దీని సాయంతో కరోనాలోని ఇతర వేరియంట్లతోపాటు ఫ్లూ వైరస్‌ను కూడా గుర్తించొచ్చు. ఈ విధానం ద్వారా ఇళ్ల వద్దే కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించొచ్చు. ఈ యాప్‌.. 25 నిమిషాల్లోనే పరీక్షను పూర్తి చేస్తుంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న వ్యాధి నిర్ధారణ పరీక్షల కన్నా చౌకలో దీన్ని నిర్వహించొచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన మైఖేల్‌ మాహన్‌ తెలిపారు. ‘‘ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. మేం రూపొందించిన వ్యాధి నిర్ధారణ పరీక్షను ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడానికి ఇది సాయపడుతుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ ల్యాబ్‌ కిట్‌ను 100 డాలర్ల కన్నా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేయవచ్చని పేర్కొన్నారు. దీనికి ‘స్మార్ట్‌-ల్యాంప్‌’ అని పేరు పెట్టారు. ఇందులో స్వల్ప మోతాదులో రోగి నుంచి లాలాజలాన్ని సేకరించి, స్మార్ట్‌ఫోన్‌లోని కెమెరా, డయాగ్నోస్టిక్‌ కిట్‌ సాయంతో విశ్లేషణ చేపట్టవచ్చు. పరీక్ష నిర్వహణకు అదనంగా ఎలాంటి సాధనాలు అవసరం లేదు. కచ్చితత్వం, సున్నితత్వం దృష్ట్యా కొవిడ్‌ నిర్ధారణలో పీసీఆర్‌ పరీక్షను ప్రామాణికమైనదిగా పరిగణిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియకు ఎక్కువ సమయం పడుతోందని, ధర కూడా ఎక్కువగా ఉందని, పైగా సులువుగా ఎక్కడికైనా తీసుకెళ్లే వెసులుబాటు ఉండదని శాస్త్రవేత్తలు వివరించారు. తమ విధానంతో ఈ ఇబ్బందిని అధిగమించొచ్చన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని