Antibodies: వ్యాయామంతో యాంటీబాడీలు పుష్కలం

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు పుష్కలంగా ఉత్పత్తి అవ్వాలంటే? ఇందుకు మనం చేయాల్సింది ఏమైనా ఉందా? సరిగ్గా ఈ అంశంపైనే పరిశోధన ...

Updated : 16 Feb 2022 10:24 IST

టీకా తీసుకున్న తర్వాత 90 నిమిషాలు చేయాలి

వాషింగ్టన్‌: కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు పుష్కలంగా ఉత్పత్తి అవ్వాలంటే? ఇందుకు మనం చేయాల్సింది ఏమైనా ఉందా? సరిగ్గా ఈ అంశంపైనే పరిశోధన సాగించారు... లోవా స్టేట్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. టీకా తీసుకున్న అనంతరం గంటన్నర పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వ్యాయామం చేస్తే, కొద్దిరోజుల్లోనే యాంటీబాడీలు పుష్కలంగా ఉత్పత్తి అవుతాయని గుర్తించారు. ఈ పరిశోధన వివరాలను ‘బ్రెయిన్, బిహేవియర్, ఇమ్యూనిటీ’ పత్రిక అందించింది.

ఎలా కనుగొన్నారు?
కొంతమంది వాలంటీర్లకు కొవిడ్, సీజనల్‌ ఫ్లూ వ్యాక్సిన్లు అందించారు. అనంతరం వీరిలో కొందరు గంటన్నరపాటు సైకిల్‌ తొక్కడం, నడవడం, పరుగెత్తడం వంటివి చేశారు. మరికొందరు కేవలం 45 నిమిషాలే వ్యాయామం చేశారు. అంతసేపూ వారి గుండె నిమిషానికి 120-140 సార్లు కొట్టుకునేలా చూసుకున్నారు. ఇంకొందరు మాత్రం టీకా తీసుకున్న తర్వాత అసలు ఎలాంటి వ్యాయామాలూ చేయలేదు. కొన్ని వారాల తర్వాత వీరందరిలో యాంటీబాడీల స్థాయుల్ని శాస్త్రవేత్తలు పరీక్షించారు. గంటన్నర పాటు వ్యాయామం చేసినవారిలోనే ఎక్కువగా ప్రతినిరోధకాలు ఉన్నట్టు గుర్తించారు.

కారణాలేంటి?
‘‘వ్యాయామంతో రక్తం, లింఫ్‌ ప్రసరణ మెరుగై.. వ్యాధినిరోధక కణాలు శరీరమంతటా సమర్థవంతంగా పంపిణీ అవుతాయి. వ్యాయామం చేయడం వల్ల ఉత్పత్తి అయ్యే ఒక రకం ప్రొటీన్‌ కూడా యాంటీబాడీలు, టి-కణాలు విడుదలయ్యేందుకు దోహదపడతాయి’’ అని పరిశోధనకర్త మరియన్‌ కొహట్‌ వివరించారు. ఇలా ఎందుకు జరుగుతోందన్నది సవివరంగా తెలుసుకోవడానికి మరింత పరిశోధన సాగించాల్సి ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని