హైదరాబాద్‌లో పెట్టుబడులకు మసాచుసెట్స్‌ గవర్నర్‌ ఆసక్తి.. మంత్రి కేటీఆర్‌తో భేటీ

తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్ర గవర్నర్‌ చార్లీ బేకర్‌ ప్రకటించారు.

Updated : 25 Mar 2022 15:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్ర గవర్నర్‌ చార్లీ బేకర్‌ ప్రకటించారు. ఆరోగ్య రంగంపై బోస్టన్‌లో జరుగుతున్న ‘గ్లోబల్‌ ఇన్నోవేషన్‌-2022’ సదస్సులో భాగంగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చార్లీ బేకర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌, బోస్టన్‌ నగరాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా హైదరాబాద్‌ మాదిరిగా బోస్టన్‌లోనూ అనేక ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌, ఐటీ రంగాలకు చెందిన పరిశ్రమలు ఉన్నాయని తెలిపారు.

ఈ రెండు రాష్ట్రాల మధ్య పెట్టుబడులకు సంబంధించిన పరస్పర అంశాలను పరిశీలించడంతో పాటు లైఫ్‌ సైన్సెస్, ఫార్మా కంపెనీల మధ్య అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందదని గవర్నర్‌ చార్లీ బేకర్‌ అభిప్రాయపడ్డారు. బోస్టన్‌లో హెల్త్‌ కార్డుల డిజిటలీకరణ కొనసాగుతోందని.. తద్వారా ఇక్కడి ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని కేటీఆర్‌కు గవర్నర్‌ వివరించారు. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో దీనివల్ల వేగంగా ప్రజలకు చికిత్స అందించే అవకాశం కలిగిందన్నారు.

అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌- బోస్టన్‌ నగరాల మధ్య అవగాహన కోసం చేపట్టే కార్యక్రమాలతో భవిష్యత్‌లో మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశముందన్నారు. బయో, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలకు ప్రాధాన్యం పెరుగుతున్న  నేపథ్యంలో హైదరాబాద్‌లో ఉన్న అవకాశాలు మంత్రి వివరించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు ముందుకురావాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని