Updated : 21 Apr 2022 15:55 IST

Andhra News: సీఎం కాన్వాయ్‌కు ప్రయాణికుల కారు.. ఇద్దరిపై సస్పెన్షన్‌ వేటు

నడిరోడ్డుపై శ్రీనివాస్‌ కుటుంబం

అమరావతి: ఒంగోలులో సీఎం కాన్వాయ్‌ కోసం తిరుమల వెళ్తున్న భక్తుల కారును ఆర్టీఏ సిబ్బంది స్వాధీనం చేసుకున్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై పలు విమర్శలు రావడం.. సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. హోంగార్డు పి. తిరుపతిరెడ్డి, అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎ.సంధ్యను సస్పెండ్‌ చేశారు. కారు స్వాధీనం ఘటనకు బాధ్యులని చేస్తూ వారిద్దరిపై అధికారులు చర్యలు తీసుకున్నారు.

మొక్కులు చెల్లించుకోలేకపోయాం..

మరోవైపు కారు స్వాధీనంపై వేముల శ్రీనివాస్‌ కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ‘‘పోలీసుల చర్యలతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యాం. కారు స్వాధీనం చేసుకోవడంతో తిరుమలకు ఆలస్యంగా చేరుకున్నాం. అలిపిరి నుంచి మెట్లపూజతో కాలినడకన తిరుమల వెళ్లాలనుకున్నాం. ఆలస్యం అవడంతో మొక్కు చెల్లించకుండానే తిరుమలకు చేరుకోవాల్సి వచ్చింది. మూడు సార్లు కాలినడకన వెళ్లాలని మొక్కుకున్నాం. ఇప్పటికే రెండు సార్లు మొక్కులు తీర్చుకున్నాం. పోలీసుల నిర్వాకంతో మూడోసారి మొక్కులు తీర్చుకోలేకపోయాం’’ అని వేముల శ్రీనివాస్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

జరిగింది ఇదీ..

పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్‌ కుటుంబం వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరింది. ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పిల్లలతో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్నారు. ఆకలిగా ఉండటంతో బుధవారం రాత్రి పది గంటలు దాటిన తర్వాత ఒంగోలు నగరంలోకి వచ్చారు. అలా రావడమే వారు చేసిన తప్పయింది.. స్థానిక పాత మార్కెట్‌ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్‌ చేస్తుండగా హోంగార్డు అక్కడికి వచ్చారు. ఈ నెల 22న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు పర్యటన నేపథ్యంలో.. కాన్వాయ్‌ కోసం వాహనంతో పాటు డ్రైవర్‌ను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాము కుటుంబంతో తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు. ఉన్నతాధికారుల ఆదేశాలు సార్‌.. మీకు సారీ చెప్పడం తప్ప మేమేమీ చేయలేమంటూ కారుతో పాటు డ్రైవర్‌ను తీసుకుని ఆయన వెళ్లిపోయారు.

ఏం చేయాలో అర్థంకాక శ్రీనివాస్‌ కుటుంబం రాత్రివేళ నడిరోడ్డుపై ఉండాల్సి వచ్చింది. సీఎం కాన్వాయ్‌కు వాహనాలు కావాలంటే స్థానికులను అడిగి తీసుకోవాలనీ, దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న వారి నుంచి, అందునా మొక్కులు తీర్చుకునేందుకు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న వారి వాహనాలు లాక్కుని రోడ్డుపాలు చేయడం ఏమిటని వారు వాపోయారు. ఊరుకాని ఊళ్లో తమకు ఇప్పటికిప్పుడు తిరుమల వెళ్లేందుకు వాహనం ఎక్కడ దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాత్రి ఒంటి గంట ప్రాంతంలో వినుకొండ నుంచి మరో వాహనాన్ని తెప్పించుకుని వాళ్లు తిరుమల వెళ్లారు.  ఈ ఘటనపై తీవ్ర విమర్శలు రావడం.. సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో బాధ్యులపై అధికారులు చర్యలు చేపట్టారు. 


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని