Harish Rao: బస్తీ ప్రజల సుస్తీ పొగొట్టేందుకు విప్లవాత్మక చర్యలు: హరీశ్‌రావు

బస్తీవాసులకు సేవ చేయాలని విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

Updated : 11 May 2022 16:44 IST

హైదరాబాద్‌ : బస్తీవాసులకు సేవ చేయాలని విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నార్సింగిలో డయాగ్నోస్టిక్‌ హబ్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

‘బస్తీ ప్రజల సుస్తీ పోగేట్టేందుకు విప్లవాత్మక చర్యలు చేపడుతున్నాం. 350 బస్తీ దవాఖానాలు హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాం. ఇక వైద్య పరీక్షల పేరున వేల రూపాయలను ప్రజలు పోగొట్టుకుంటున్నారు. అందుకే టి డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. దీని ద్వారా మెమోగ్రఫీ, 2డి ఎకో, ఎక్స్‌రే వంటి సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం టి డయాగ్నోస్టిక్స్‌లో 57 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. భవిష్యత్తులో 134 రకాల సేవలకు విస్తరిస్తాం.  హైదరాబాద్‌లో 20రేడియాలజీ ల్యాబ్‌లు అందుబాటులోకి తెస్తున్నాం. నూతనంగా అందుబాటులోకి వచ్చిన యాప్ ద్వారా దగ్గర్లోని బస్తీ దవాఖానాల చిరునామా, రేడియాలజీ ల్యాబ్‌ల సమాచారాన్ని తెలుసుకోవచ్చు. టెస్టుల వివరాలనూ ఈ యాప్‌లోనే పొందొచ్చు. ప్రభుత్వానికి సైతం ఎప్పటికప్పుడు అధికారుల పనితీరును పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. యాప్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలి. నగరంలో నాలుగు సూపర్ స్పెషలిటీ ఆస్పత్రులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. 3 అంచెల వైద్య వ్యవస్థ తెలంగాణలో అమలవుతోంది’ అని హరీశ్‌ రావు అన్నారు.

మందులు, పరీక్షల కోసం రోగులు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండొద్దని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కిడ్నీ, లివర్‌, లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చికిత్సలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తున్నామని వివరించారు. ప్రజలు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లి డబ్బులు వృథా చేసుకోవద్దని సూచించారు.

వైద్యులను మందలించిన మంత్రి..
నార్సింగి యూపీహెచ్‌సీ వైద్యులను మంత్రి హరీశ్‌రావు మందలించారు. ఆరుగురు వైద్యులు సహా మొత్తం 32 మంది సిబ్బంది ఉన్నా రోగుల సంఖ్య తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపీ రిజిస్టర్ సరిగా నిర్వహించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని