TSLPRB: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలు.. ఈరోజే లాస్ట్‌ డేట్‌!

తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అభ్యర్థులు ఈరోజు రాత్రి 10గంటల వరకు దరఖాస్తు

Published : 20 May 2022 12:18 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. అభ్యర్థులు ఈరోజు రాత్రి 10గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో 17,291 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. దీనికోసం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈనెల 2వ తేదీన ప్రారంభమైన ప్రక్రియ నేటితో ముగియనుంది. చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సర్వర్లలో సాంకేతిక సమస్య తలెత్తకుండా వాటి సామర్థ్యాన్ని అధికారులు పెంచారు.

గురువారం ఒక్కరోజే దాదాపు లక్ష దరఖాస్తులు వచ్చాయి. ఒకేసారి నగదు చెల్లింపులు జరుపుతుండటంతో సాంకేతికత సమస్యలు తలెత్తుతున్నాయి. చెల్లింపు విఫలమైనట్లు సందేశం వస్తున్నా.. నగదు మాత్రం ఖాతాలో నుంచి డెబిట్ అవుతోందని అభ్యర్థులు అధికారుల దృష్టికి తీసుకొస్తున్నారు. నగదు సఫలీకృతమైతేనే దరఖాస్తు ప్రక్రియ పూర్తవతుందని పోలీసు నియామక మండలి అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ఖాతాలో నగదు డెబిట్ అయినా వారం రోజుల వ్యవధిలో తిరిగి జమ అవుతోందని అధికారులు తెలిపారు.

శుక్రవారం ఉదయం 9 గంటల వరకు 10లక్షల దరఖాస్తులు వచ్చినట్లు పోలీస్ నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస రావు తెలిపారు. 5.6 లక్షల మంది అభ్యర్థులు వివిధ విభాగాల వారీగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసినట్లు ఆయన చెప్పారు. ఆరు నోటిఫికేషన్ల ద్వారా పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖ, ప్రత్యేక భద్రతా దళం, రవాణా, ఆబ్కారీ శాఖలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వీటిలో 15,644 కానిస్టేబుల్‌ పోస్టులు, 554 ఎస్సై పోస్టులు, 614 ఎక్సైజ్ కానిస్టేబుల్, 383 కమ్యూనికేషన్ కానిస్టేబుల్‌, 63 రవాణా కానిస్టేబుల్‌, 33 వేలిముద్రల ఏఎస్సై పోస్టులు భర్తీ చేయనున్నారు. వచ్చే మార్చి నాటికి ఈ ఉద్యోగాల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీసు నియామక మండలి అధికారులు భావిస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని