Srisailam-Sagar: ఎగువ నుంచి వరద.. శ్రీశైలం, సాగర్‌ గేట్లు ఎత్తివేత

ఎగువ నుంచి వస్తోన్న వరదతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.

Updated : 11 Aug 2022 14:22 IST

నాగార్జునసాగర్‌, సున్నిపెంట సర్కిల్‌: ఎగువ నుంచి వస్తోన్న వరదతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గురువారం ఉదయం శ్రీశైలం నుంచి 4,72,708 క్యూసెక్కుల వరద నీరు నాగార్జునసాగర్‌ జలాశయానికి చేరడంతో మొత్తం 26 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. జలాశయం నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 586 అడుగులకు చేరింది. 

మరోవైపు శ్రీశైలం జలాశయంలోని 10 రేడియల్‌ గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,76,670 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. శ్రీశైలం కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 50,466 క్యూసెక్కుల వరద నీటిని అదనంగా నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. జురాల, సుంకేసుల జలాశయాల నుంచి 4,88,884 క్యూసెక్కులు వరద నీరు శ్రీశైలం జలాశయానికి వస్తోంది. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం గురువారం ఉదయం 9 గంటల సమయానికి 884.40 అడుగులు, నీటి నిల్వ సామర్థ్యం 212.4385 టీఎంసీలుగా నమోదైంది. 

శ్రీశైలం జలాశయం 10 రేడియల్‌  గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో సందర్శకులు, శ్రీశైలానికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో ఈ దృశ్యాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వరుసగా సెలవులు కావడంతో శ్రీశైలానికి సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది.

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని