ఆమె వయసు.. స్వేచ్ఛా ఉషస్సు

15 ఆగస్టు, 1947.. అర్ధరాత్రి తెెల్లదొరల పాలన నుంచి భారతమాత బానిస సంకెళ్లను తెంచుకున్న తరుణమది. దేశమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ సంబరాలు

Updated : 14 Aug 2022 08:08 IST

కరీంనగర్‌ సాంస్కృతికం, న్యూస్‌టుడే : 15 ఆగస్టు, 1947.. అర్ధరాత్రి తెెల్లదొరల పాలన నుంచి భారతమాత బానిస సంకెళ్లను తెంచుకున్న తరుణమది. దేశమంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుతూ సంబరాలు చేసుకుంటున్న వేళ. తెలంగాణ ఇంకా నిజాం పాలనలోనే ఉంది. స్వతంత్ర సంబరాలు చేసుకునేందుకు భయంభయంగా కాలం వెళ్లదీసే రోజున నిర్మల్‌లో ఓ చిన్నారి ఈ లోకంలోకి అడుగుపెట్టింది. స్వాతంత్రోద్యమంలో పాలుపంచుకున్న ఆ చిన్నారి కుటుంబ సభ్యులు మురిసిపోయారు. తమ ఇంట్లో సాక్షాత్తు భరతమాతే అడుగుపెట్టిందని సంబరపడిపోయారు. ‘భారతమాత’ అని పేరు పెట్టారు. దేశభక్తి.. దైవభక్తి కల్గిన కుటుంబంలో ఆ చిన్నారి పెరిగి పెద్దదైంది. భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రపంచానికే మార్గదర్శిగా నిలుస్తున్న రోజులను చూస్తూ పెరిగింది. భారతమాత కూడా తన ముగ్గురు కూతుళ్లు.. ఇద్దరు కుమారులను ప్రయోజకులను చేసింది. ఇద్దరు కూతుళ్లు, అల్లుళ్లు ప్రభుత్వ ఉపాధ్యాయులు. మరో కూతురు, అల్లుడు అధ్యాపకులు, ఒక కొడుకు కెనడాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో పాటు అక్కడి ఆర్మీలో పనిచేస్తున్నాడు. మరో కుమారుడు నేటి యువతకు నైపుణ్యాలు నేర్పిస్తున్నారు. నేడు దేశమంతా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో మునిగితేలుతున్నారు. భారతమాత కూడా 75వ పుట్టిన రోజు సంబరాన్ని తలచుకొని ఎంతో ముచ్చటపడుతూ ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. వజ్రోత్సవాలకు సిద్ధమవుతున్న వేళ ఈ భారతమ్మను ‘న్యూస్‌టుడే’ పలకరించింది. ఆమె మాటల్లోనే.. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజే నువ్వు పుట్టావని తాతయ్య, అమ్మమ్మలు చెబుతుంటే ఎంతో సంబరపడి పోయేదాన్ని. ప్రతి స్వాతంత్య్ర దినోత్సవం రోజునే నేను పుట్టిన రోజు వేడుకలు నా పిల్లలు ఘనంగా నిర్వహిస్తారు. మాది ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌. నాన్న కో-ఆపరేటివ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేసేవారు. ఆ రోజుల్లోనే బోథ్‌లోనే హెచ్‌ఎస్‌సీ వరకు చదివాను. చదువు పూర్తికాగానే మావాళ్లు డాక్టర్‌ రామకృష్ణయ్యతో వివాహం చేశారు. ఆ సమయంలోనే ప్రభుత్వ ఉద్యోగ అవకాశం వచ్చినా అప్పటికే మా వారు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో గృహిణిగా ఉండి పోయాను. ముగ్గురు కూతుళ్లను, ఇద్దరు కుమారులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దా. మా ఆయన కరీంనగర్‌లో పశుసంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా, డీఆర్డీఏలో ఏపీఓగా పనిచేశారు. ప్రస్తుతం కరీంనగర్‌లో ఉంటున్నాం. స్వాతంత్య్ర దినోత్సవానికి గుర్తుగా మా వాళ్లు భారతమాతగా పేరు పెట్టడం నాకు ఎంతో గర్వంగా ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని