పెద్దల నోటికి.. పేదల బియ్యం

పేదల బియ్యం పెద్దల బీరువాల్లో కట్టలు నింపుతోంది. ప్రభుత్వం పేదల కడుపు నింపాలనే లక్ష్యంతో ఇచ్చే బియ్యం నాణ్యంగా ఉండటం లేదని ఎక్కువ మంది తినడం లేదు.

Updated : 25 Jan 2023 06:36 IST

వైకాపా నేతల కనుసన్నల్లో దందా  
చిత్తూరు కేంద్రంగా అక్రమ వ్యాపారం

పోలీసులు పట్టుకున్న బియ్యం బస్తాల లారీ (పాత చిత్రం)

పలమనేరు, న్యూస్‌టుడే: పేదల బియ్యం పెద్దల బీరువాల్లో కట్టలు నింపుతోంది. ప్రభుత్వం పేదల కడుపు నింపాలనే లక్ష్యంతో ఇచ్చే బియ్యం నాణ్యంగా ఉండటం లేదని ఎక్కువ మంది తినడం లేదు. ఒకప్పుడు ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తామని ప్రకటించింది. తర్వాత సాధారణ ముతక బియ్యంతోనే సరిపెట్టింది. దీన్ని వైకాపా నేతలు సన్న బియ్యంగా మారుస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలున్నాయి.

రూ.17 కొని.. రూ.50 విక్రయించి

రేషన్‌ బియాన్ని ప్రజలు కొందరు మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. కిలో రూ.12 చొప్పున వ్యాపారులు కొనుగోలు చేస్తారు. అదే బియ్యాన్ని ఓ బడా వ్యక్తి వారి నుంచి రూ.17 చొప్పున తీసుకుంటాడు. కర్ణాటక రాష్ట్రానికి పంపి పాలిష్‌ పెట్టిస్తాడు. అదే బియ్యం మళ్లీ పేదలున్న మార్కెట్‌కు తిరిగి వస్తుంది. ఇక్కడ కిలో రూ.50 చొప్పున సన్నబియ్యం పేరిట విక్రయిస్తారు. ఎక్కడి నుంచి బియ్యం సేకరిస్తారో అక్కడికే అదే బియ్యాన్ని నాజూకు బస్తాల్లో నింపి సన్నబియ్యంగా పంపించే మాయా తంత్రం ఈ వ్యాపారులది. ఈ వ్యవహారానికి మూల కేంద్రం చిత్తూరు. వైకాపాకు చెందిన ఓ నాయకుడి కనుసన్నల్లో ఈ వ్యవహారం నడుస్తోంది. సమీపంలోని తమిళనాడు ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఇస్తున్న ఉప్పుడు బియ్యాన్ని కూడా ఇదే ధరకు కొనుగోలు చేస్తున్నారు. దాన్నీ కర్ణాటకకు తరలించేస్తున్నారు.

రాజకీయ అండతో..

ఈ వ్యవహారం నడపడానికి వ్యాపారులు ఏజెంట్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. చిత్తూరు, పుంగనూరు, పీలేరు, చంద్రగిరి, నగరి నియోజకవర్గాల నుంచి ఏజెంట్లు బియ్యం సేకరిస్తారు. 10 టన్నుల వరకు సేకరించాక ప్రధాన వ్యాపారి తన వాహనాల్లో కర్ణాటకలోని బంగారుపేట మిల్లర్లకు అందిస్తాడు. అక్కడ పాలిష్‌ పెట్టాక తీసుకొచ్చి బస్తా రూ.1100 చొప్పున ఇక్కడే విక్రయించి  లాభాలు పొందుతాడు. ఇందుకోసం అన్ని వర్గాల వారికి మామూళ్లు చెల్లిస్తారు. దీనికి రాజకీయ అండ కూడా ఉంటుంది. పలమనేరులోనూ అధికార పార్టీతో అంటకాగుతూ తిరిగే ఇద్దరు చోటా నాయకులు ఈ వ్యాపారం చేస్తున్నారని తెలుస్తోంది. కొందరు చిన్న వ్యాపారులు మాత్రం కిలో రూ.12 చొప్పున కొనుగోలు చేసి కర్ణాటక మిల్లర్లకు కిలో రూ.19 చొప్పున విక్రయించి.. కిలోకు రూ.7 చొప్పున ఆదాయం పొందుతున్నారు. దాన్ని అక్కడి మిల్లర్లు సన్న బియ్యం పేరిట బస్తాలకు రంగులేసి పేర్లు రాసి పెద్ద మార్కెట్‌కు పంపుతున్నారు.

పరారీలో సూత్రధారులు

గత నెల చిత్తూరు పట్టణం ఇరువారం నుంచి బంగారుపేటకు అక్రమంగా రూ.3.97 లక్షల విలువైన రేషన్‌ తరలిస్తున్న లారీని గంగవరం మండలం గండ్రాజుపల్లె వద్ద రీజినల్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు పట్టుకున్నారు. డ్రైవర్‌ను అరెస్టు చేయగా అసలైన రమణ అనే వ్యక్తి పరారయ్యాడు.

రోజుకు నాలుగైదు లారీలైనా..

ప్రస్తుతం చిత్తూరు, పలమనేరు కేంద్రాల నుంచి రోజుకు కనీసం ఐదు లారీలైనా బియ్యం పక్క రాష్ట్రానికి తరలిపోతోంది. కొన్నిచోట్ల బియ్యం నిల్వ చేసే కేంద్రాలు ఉన్నాయి. పలమనేరు, గంగవరం ప్రాంతాల్లో బియ్యం నిల్వ చేస్తున్నారు. పది టన్నులు వచ్చాక లారీలో నింపి పంపుతారు.

పూర్తిగా నిలుపుదల చేస్తాం

బియ్యం అక్రమ రవాణా చేసే వారి వివరాలు సేకరిస్తున్నాం. పూర్తిగా అక్రమ రవాణా లేకుండా రూపుమాపే ప్రయత్నాలు చేస్తున్నాం. ఇది వరకు కొందరిని అరెస్టు చేసి బియ్యం స్వాధీనం చేసుకున్నాం. ఈ వ్యాపారం చేస్తున్నారని తెలిసిన వారిని తప్పకుండా అరెస్టు చేస్తాం.

- సుధాకరరెడ్డి, డీఎస్పీ, పలమనేరు

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని