ఆదరణ కరవు.. చరిత్రకు చెదలు

రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచిన ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో క్రీ.శ. 1వ శతాబ్ద నాటి గౌతమ బుద్ధుడి ఆనవాళ్లకు భద్రత కరవైంది.

Updated : 30 Jan 2023 05:58 IST

ఫణిగిరి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించిన ముంబయి విశ్వవిద్యాలయం పురావస్తు శాస్త్ర విద్యార్థులు

నాగారం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే ప్రఖ్యాతి గాంచిన ఫణిగిరి బౌద్ధక్షేత్రంలో క్రీ.శ. 1వ శతాబ్ద నాటి గౌతమ బుద్ధుడి ఆనవాళ్లకు భద్రత కరవైంది. ఫలితంగా చరిత్రకే చెదలు అన్న చందంగా ఆ పరిసరాలు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ లభించిన శిల్పాలు, కుడ్యాలు, చైత్యాలు, జాతక కథలు వేల ఏళ్లనాటి చరిత్రకు సాక్ష్యాలు. నాటి చరిత్రను, ప్రజల జీవన శైలిని అధ్యయనం చేయడానికి ఎంతో మంది దేశ, విదేశాలకు చెందిన చరిత్రకారులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన ఫణిగిరిలో పురావస్తు చరిత్ర గబ్బిలాల వాసన మధ్య చిమ్మచీకటిలో మగ్గుతోంది. చారిత్రక ప్రాంతాన్ని అభివృద్ది పరుస్తున్నామని పాలకులు చెబుతున్న మాటలు నీటిమూటలుగానే మిగులుతున్నాయి తప్ప అడుగు ముందుకు పడటం లేదు.


ఫణిగిరిలో పర్యాటకుల సందడి

ఫణిగిరి క్షేత్రాన్ని ముంబయి యూనివర్సిటీ విద్యార్థులు ఆదివారం సందర్శించారు. దేశంలోని బౌద్ధమత ఆనవాళ్లపై అధ్యయనంలో భాగంగా ఆ విశ్వవిద్యాలయంలో పురావస్తు శాస్త్రంలో గౌతమ బుద్ధ చరిత్రను పరిశోధిస్తున్న 110 మంది విద్యార్థులు ఇక్కడ సందడి చేశారు. మ్యూజియంలో భద్రపరచిన శిల్పాలను పరిశీలించారు. అపూర్వమైన బౌద్ధ సంపదను ఇరుకైన చీకటి గదిలో ఉంచడంపై వారు విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా పురావస్తుశాస్త్ర విభాగం ఆచార్యులు(హెచ్‌వోడీ) డాక్టర్‌ యోజనా భగత్‌ మాట్లాడుతూ ఇక్కడ లభించిన చారిత్రక సంపద చాలా విలువైందన్నారు. అన్ని వసతులతో కూడిన గొప్ప పర్యాటక ప్రాంతంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పురావస్తు శాస్త్ర విద్యార్థులు బాలాసాహెబ్‌ సునంద, బాధిమిత్ర, మహాదేవ్‌, క్షేత్ర సిబ్బంది గట్టు వీరయ్య, కార్తీక్‌ పాల్గొన్నారు.


కనీస వసతులు కల్పించాలి

- బడీ బాగుల్‌, చరిత్ర అధ్యయనకారుడు, ముంబయి విశ్వవిద్యాలయం

ఫణిగిరిలో లభించిన చరిత్ర సాక్ష్యాలు చాలా విలువైనవి. వీటిని సందర్శించడానికి వస్తున్న పర్యాటకులకు కనీస సదుపాయాలైన తాగునీరు, మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలి.


శాశ్వత మ్యూజియం నిర్మించాలి

- బడీ మిత్ర మహాదేవ్‌, బుద్ధిస్ట్‌ స్టడీస్‌ విద్యార్థి, ముంబయి విశ్వవిద్యాలయం

క్రీ.శ. 1వ శతాబ్దంలో లభించిన బౌద్ధమత ఆనవాళ్లను నిత్యం గబ్బిలాలు సంచరిస్తున్న చీకటి గదిలో భద్రపరచడం ఆశ్చర్యానికి గురిచేసింది. భావి తరాలు తెలుసుకోవాల్సిన చరిత్రను శిథిలావస్థలో ఉన్న భవనంలో ఉంచారు. అన్ని వసతులతో కూడిన శాశ్వత మ్యూజియం నిర్మించి అందులోకి మార్చాలి. పర్యాటకులు సందర్శించేందుకు వీలుగా తీర్చిదిద్దాలి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు