దుర్గమ్మ దర్శనం టికెట్ల విక్రయాల్లో చేతివాటం

దుర్గమ్మ దర్శనం టికెట్ల జారీ కౌంటర్లలో పని చేసే ఉద్యోగి చేతివాటానికి పాల్పడిన ఘటన సోమవారం వెలుగు చూసింది. ఆదివారం మాఘ పూర్ణిమ కావడంతో దుర్గమ్మ దర్శనానికి వేలాది భక్తులు తరలివచ్చారు.

Updated : 07 Feb 2023 06:26 IST

ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: దుర్గమ్మ దర్శనం టికెట్ల జారీ కౌంటర్లలో పని చేసే ఉద్యోగి చేతివాటానికి పాల్పడిన ఘటన సోమవారం వెలుగు చూసింది. ఆదివారం మాఘ పూర్ణిమ కావడంతో దుర్గమ్మ దర్శనానికి వేలాది భక్తులు తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌కు సమీపంలోని పఠాన్‌చెరువు ప్రాంతానికి నుంచి 19 మంది అమ్మవారి దర్శనానికి వచ్చారు. అంతరాలయ దర్శనం చేసుకోవాలంటే 19 టికెట్లు తీసుకోవాలని మల్లికార్జున మహా మండపం కౌంటరులో ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ చెప్పారు. దర్శనానికి వచ్చిన వారిలో నలుగురు చిన్నారులు ఉన్నారు. దాంతో ఆ భక్తుడు హైదరాబాద్‌లోని కార్పొరేటర్‌తో ఫోన్‌లో ఆ ఉద్యోగికి ఫోను చేయించగా... 15 టికెట్లకు అంగీకరించారు. టికెట్ల కోసం కౌంటర్‌లోని ఉద్యోగికి రూ.7,500 నగదు ఇవ్వగా.. ఆయన 15 టికెట్లు ఇచ్చి పంపారు. ఆ టికెట్లు తీసుకొని లిఫ్టు మార్గంలో వచ్చి క్యూల్లో ఆలయంలోకి రాగా.. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగి వారిలో 8 మందికి మాత్రమే అంతరాలయ దర్శనానికి అనుమతించారు. మిగతా వారు రూ.100 క్యూలైన్లోకి వెళ్లాలని చెప్పడంతో ఆ భక్తుడు కంగుతిన్నారు. 15 టికెట్లలో 8 మాత్రమే రూ.500 టిక్కెట్లు ఉన్నాయి. మిగతా 7 టికెట్లు రూ.100 ఉండటంతో దేవస్థానానికి రావాల్సిన ఆదాయంలో రూ.2,800కు గండి పడిన విషయం వెలుగు చూసింది. ఈవో భ్రమరాంబ సెలవులో ఉండటంతో దేవస్థానం అధికారులు ఆ భక్తుడి నుంచి ఫిర్యాదు తీసుకోవడంతో పాటు టికెట్ల పంచనామా చేసి నివేదిక సిద్ధం చేసినట్లు తెలిసింది. శుక్రవారం, ఆదివారాల్లో టికెట్ల కౌంటర్లలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మాన్యువల్‌ టికెట్ల స్థానంలో కంప్యూటరు ప్రింట్‌తో టికెట్లు ఇస్తున్నా అవకతవకలు తప్పడం లేదు. అధికారులు స్పందించి కంప్యూటర్‌ ప్రింట్‌లో కూడా రూ.500, రూ.100 టిక్కెట్ల మధ్య వ్యత్యాసం ఉండేలా చూడాలని భక్తులు కోరుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని