పిల్లలూ.. జర పైలం

అంతర్జాలం.. ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తున్న సాంకేతిక సదుపాయం. ఇది ఎంత సౌకర్యవంతమో అంతలా ప్రమాదకరంగానూ మారిందని పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి.

Updated : 07 Feb 2023 06:22 IST

స్వీయ జాగ్రత్తలే కీలకం
నేడు సురక్షిత అంతర్జాల దినోత్సవం
న్యూస్‌టుడే, ఇందూరు ఫీచర్స్‌, నిజామాబాద్‌ నేరవార్తలు

అంతర్జాలం.. ప్రతి ఒక్కరి జీవితాన్ని ప్రభావితం చేస్తున్న సాంకేతిక సదుపాయం. ఇది ఎంత సౌకర్యవంతమో అంతలా ప్రమాదకరంగానూ మారిందని పలు ఘటనలు రుజువు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏటా ఫిబ్రవరిలో ‘సురక్షిత అంతర్జాల దినోత్సవం’ నిర్వహించాలని కొన్ని దేశాలు నిర్ణయించాయి. పిల్లలు మొదలు అన్నివర్గాల వినియోగదారుల్లో సురక్షిత ఇంటర్నెట్‌ విధానాలపై అవగాహన పెంపొందించడానికి ప్రయత్నిస్తున్నారు.

చిన్నారులు, యువత..

ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం పిల్లలు, యువత ఉంటున్నారు. అనేక సాంకేతిక విషయాలపై వీరికి అవగాహన ఉంటున్నా.. సురక్షిత విధానంలో వినియోగించడంలో విఫలమవుతున్నారు. ప్రధానంగా వ్యక్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. వివిధ ప్రకటనలకు ఆకర్షితులై ఊబిలో చిక్కుకుపోతున్నారు. ఈ విషయం తెలుసుకునేలోగా నష్టం జరిగిపోతోంది. విద్య, ఉద్యోగ నైపుణ్యాల వరకు యువత.. ఇంటర్నెట్‌ను వాడటం శ్రేయస్కరం.

తల్లిదండ్రులు, సంరక్షకులు

కుటుంబ పెద్దలుగా పిల్లలను సంరక్షించడం వారి బాధ్యత. కరోనా అనంతరం ఆన్‌లైన్‌ తరగతుల కారణంగా ఇంటర్నెట్‌ వాడకం తప్పనిసరైంది. వారు చదువుల పేరుతో ఏం చేస్తున్నారో పెద్దలు పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్‌ గేమ్స్‌, సామాజిక మాధ్యమాలు, ఈ-కామర్స్‌ వంటి విషయాల్లో వారి వ్యవహారశైలి గమనించాలి.

గురువులైతే..

ఇంటర్నెట్‌ ద్వారా విస్తృతంగా సమాచారాన్ని సేకరించవచ్చు. బోధన నైపుణ్యాల పెంపు, విషయ పరిజ్ఞానానికి ఉపయోగించుకునే క్రమంలో విద్యార్థులకు భద్రతాపరమైన అంశాలు బోధించాలి. తగిన జాగ్రత్తలు వివరించాలి.
* సంస్థలు, ఉద్యోగులైతే భద్రతాపరమైన సాఫ్ట్‌వేర్‌, అప్లికేషన్లు వాడాలి.
* 8-12 మధ్య వయసుల్లోని 10 మంది పిల్లల్లో ఆరుగురు ఆన్‌లైన్‌ ప్రమాద బాధితులవుతున్నారు. ఇద్దరిలో ఒకరు సైబర్‌ బెదిరింపులు ఎదుర్కొంటున్నారు.
* పిల్లల్లో 65 శాతం మంది ఆన్‌లైన్‌ సేవలు వాడుతున్నారు.

1930..

సైబర్‌ నేరాల ద్వారా నష్టపోయిన సొమ్మును తిరిగి పొందడానికి నిర్దేశించిన టోల్‌ఫ్రీ నంబరు ఇది. 24 గంటల్లోగా ఈ నంబరుకు ఫిర్యాదు చేస్తే వారి ఖాతాలు ఫ్రీజ్‌ చేసి సాంకేతిక ఆధారాలతో రికవరీ చేస్తారు.

ఇవి పాటించాలి..

* ఆన్‌లైన్‌ లావాదేవీలకు బలమైన పాస్‌వర్డ్‌ పెట్టుకోవాలి.
* బహిరంగ ప్రదేశాల్లోని వైఫై బ్రౌజింగ్‌లో జాగ్రత్తలు తీసుకోవాలి.
* వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దు.
* స్కామ్‌ల విషయంలో సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేయాలి.
* నకిలీ వెబ్‌సైట్లను గుర్తించాలి.
* అపరిచిత సందేశాలు, మెయిల్స్‌కు స్పందించొద్దు.


సైబర్‌ నేరాల నియంత్రణపై అవగాహన సదస్సు నేడు

ఈనాడు-ఈటీవీ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహణ

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: సురక్షిత అంతర్జాల దినోత్సవం సందర్భంగా ‘ఈనాడు-ఈటీవీ తెలంగాణ’, ‘ఈటీవీ భారత్‌’ ఆధ్వర్యంలో సైబర్‌ నేరాలపై మంగళవారం అవగాహన సదస్సు జరగనుంది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలోని చింతల బాలరాజ్‌గౌడ్‌ స్మారక ఆడిటోరియంలో దీనిని నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు జరిగే కార్యక్రమానికి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి హాజరుకానున్నారు. సైబర్‌ నేరాల నియంత్రణ అధికారులు భాగస్వాములు కానున్నారు. ఆన్‌లైన్‌ మోసాలు, ఓటీపీతో నగదు కాజేయడం, బ్యాంకుల్లో లావాదేవీల విషయంలో సైబర్‌ మోసాలు, ఏటీఎంల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని