కారులో అసమ్మతి సెగలు

అధికార పార్టీలో అసమ్మతి సెగలు ముఖ్యనేతలకు తలనొప్పిగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపించే వేళ పాలమూరులో అసమ్మతి రాగం రోజురోజుకు పెరుగుతోంది.

Updated : 10 Mar 2023 05:28 IST

వనపర్తిలో భారాసకు పలువురు ప్రజాప్రతినిధుల రాజీనామా

ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌: అధికార పార్టీలో అసమ్మతి సెగలు ముఖ్యనేతలకు తలనొప్పిగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపించే వేళ పాలమూరులో అసమ్మతి రాగం రోజురోజుకు పెరుగుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని సగం నియోజకవర్గాల్లో అధికార పార్టీలో బహిరంగంగానే ముఖ్య ప్రజాప్రతినిధులపై భారాస శ్రేణులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏకంగా మీడియా ముందుకొచ్చి మాట్లాడుతుండటంతో ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్నారు. వనపర్తిలో మంత్రి నిరంజన్‌రెడ్డిపై జిల్లా ముఖ్య ప్రజాప్రతినిధులు ఆరోపణలు గుప్పిస్తూ గురువారం భారాసకు రాజీనామా చేయడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ సహా ఇద్దరు ఎంపీపీలు, 11 మంది సర్పంచులు, ఆరుగురు ఉప సర్పంచులు, ఎనిమిది మంది ఎంపీటీసీ సభ్యులు భారాసను వీడుతున్నట్లు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత కొన్ని నెలలుగా మంత్రిపై వనపర్తి నియోజకవర్గ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, నేతలు, కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మనస్తాపంతో ఉన్నారు.

పలు నియోజకవర్గాల్లోనూ..

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మధ్య విబేధాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అక్రమ ఇసుక వ్యవహారంలో పోలీసులు, ఎమ్మెల్యే వైఖరిపై గతేడాది ఆయన విలేకరుల సమావేశం పెట్టి మరీ ఎండగట్టారు. నాగర్‌కర్నూల్‌ ఎంపీ రాములు, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదం ముదిరింది. తన కుమారుడికి జడ్పీ ఛైర్మన్‌ పదవి రాకుండా అడ్డుకున్నారని ఎంపీ రాములు బహిరంగంగానే గువ్వలపై విమర్శలు గుప్పించారు. అచ్చంపేట నియోజకవర్గంలో బ్యానర్ల ఏర్పాటులో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కల్వకుర్తిలోనూ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య విబేధాలున్నాయి. ఇక్కడ రెండు వర్గాలుగా మారి కార్యక్రమాలు చేపడుతున్నారు. కొల్లాపూర్‌లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రత్యేక కుంపటి పెట్టి తరచూ స్థానిక ఎమ్మెల్యేపై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.


వారి పయనమెటు..?

భారాసలోని అసంతృప్తి నేతలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. పార్టీలోనే ఉండి అసమ్మతి రాగం ఆలపించాలా.. ఇతర పార్టీలో చేరాలా.. అన్న దానిపై నిర్ణయాన్ని బయటకు వెల్లడించడం లేదు. వనపర్తి జిల్లాలోని భారాసకు రాజీనామా చేసిన ముఖ్యనేతలు ఓ జాతీయ పార్టీలో చేరుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రెండుమూడు రోజుల్లో దీనిపై ఓ స్పష్టత రానుంది. మిగతా నియోజకవర్గాల్లో అసంతృప్త నాయకులు  మాత్రం ప్రస్తుతం భారాసలోనే కొనసాగుతున్నారు.


నడ్డిగడ్డలో విభేదాలు..

రాజకీయ ప్రాధాన్యం ఉన్న నడిగడ్డలోనూ భారాసలో విభేదాలు కొనసాగుతున్నాయి. అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం, రాష్ట్ర ప్రభుత్వ దిల్లీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మంద జగన్నాథం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో అబ్రహం తన కుమారుడిని పోటీలో నిలపాలని భావిస్తుండగా జగన్నాథం కూడా తన కుమారుడి టిక్కెట్టు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. గద్వాలలోనూ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ సరిత మధ్య సఖ్యతలేదు. నాలుగేళ్లుగా ఎవరికి వారు ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. మక్తల్‌ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్‌రెడ్డిపై తాజాగా భారాస నేత వర్కటం జగన్నాథ్‌రెడ్డి విలేకరుల సమావేశంలో విమర్శలు గుప్పించారు. మహబూబ్‌నగర్‌లో  మున్సిపల్‌ మాజీ ఛైర్‌పర్సన్‌, మార్కెట్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు