రూ. లక్షలపై మన్ను... రూ. కోట్లపై కన్ను!

మూడేళ్ల కిందట ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పెదగంట్యాడలో ఏర్పాటు చేయతలపెట్టిన గ్యాస్‌ బేస్డ్‌ క్రిమిటోరియం (గ్యాస్‌ ఆధారిత దహన వాటిక) పనులకు గ్రహణం పట్టింది.

Updated : 25 Mar 2023 04:57 IST

అటకెక్కిన ‘గ్యాస్‌ ఆధారిత దహన వాటిక’
నిరుపయోగంగా యంత్ర సామగ్రి
మళ్లీ కొత్తగా ప్రతిపాదనలు
న్యూస్‌టుడే, గాజువాక (పెదగంట్యాడ)

వృథాగా పడి ఉన్న సామగ్రి

మూడేళ్ల కిందట ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పెదగంట్యాడలో ఏర్పాటు చేయతలపెట్టిన గ్యాస్‌ బేస్డ్‌ క్రిమిటోరియం (గ్యాస్‌ ఆధారిత దహన వాటిక) పనులకు గ్రహణం పట్టింది.

అసంపూర్తిగా భవనం నిర్మాణం

హా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) అధికారుల ముందుచూపు లేని ఫలితంతో ప్రజాధనం దుర్వినియోగమైంది.  ఇంధన దహన వాటిక పనులు దక్కించుకున్న గుత్తేదారు చేతులెత్తేయడంతో అధికారులు చేసేది లేక ఆ ప్రతిపాదనను అటకెక్కించారు. దీంతో రూ.లక్షల విలువ చేసే యంత్రాలను నిరుపయోగంగా వదిలేయడంతో తుప్పు పట్టిపోతున్నాయి. ఇటీవల మళ్లీ అదనపు నిధులతో ‘ఆధునిక శ్మశానవాటిక’ నిర్మించడానికి టెండర్లు పిలవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఇదీ పరిస్థితి:  పెదగంట్యాడ నుంచి గంగవరం వెళ్లే రహదారి పక్కన 2.5 ఎకరాల విస్తీర్ణంలోని శ్మశానవాటిక అభివృద్ధికి జీవీఎంసీ ఆధ్వర్యంలో 2020-21లో రూ.1.75 కోట్లు  కేటాయించారు.  సుమారు 14 ఉక్కు నిర్వాసిత కాలనీలు, మరో 10 శివారు కాలనీలకు అనువుగా ఉండే శ్మశానవాటిక దుస్థితిని పరిగణలోకి తీసుకున్న అధికారులు గ్యాస్‌ ఆధారిత దహన వాటికకు ప్రతిపాదించారు. ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లు పిలిచి హైదరాబాద్‌కు చెందిన గుత్తేదారుకు పనులు అప్పగించారు. ఈ గ్యాస్‌ బేస్డ్‌ క్రిమిటోరియం ప్రక్రియతో మృతదేహానికి కేవలం 30 నిమిషాల్లో అంత్యక్రియలు పూర్తయ్యే ఏర్పాట్లకు ప్రతిపాదించారు. ప్రక్రియ పూర్తయిన తర్వాత  కిలో చితాభస్మం మాత్రమే చేతికందుతుందని అధికారులు తెలిపారు. కేటాయించిన నిధుల్లో కొంత వెచ్చించి గ్యాస్‌ స్టోరేజ్‌ రూం, కార్యాలయ గది, ఫర్నేస్‌, లాకర్‌ గది నిర్మాణం పనులు ప్రారంభించి... ఆ తర్వాత అసంపూర్తిగా వదిలేశారు.

అలా వెనక్కి: 2021 ఫిబ్రవరిలో హైదరాబాద్‌, ముంబయి నుంచి తీసుకొచ్చిన యంత్ర సామగ్రిని శ్మశానవాటిక ఆవరణలో పడేయడంతో... ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తున్నాయి. వాటిని సాంకేతిక నిపుణులు వచ్చి అమర్చాల్సి ఉందంటూనే ఇన్నాళ్లు నెట్టుకొచ్చారు. ఈ జాప్యం కారణంగా ఇప్పుడా ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు జీవీఎంసీ ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

మళ్లీ రూ.3 కోట్లతో పనులా..?: అసంపూర్తి శ్మశానవాటికకు కొత్త రూపు తీసుకురావడానికి జీవీఎంసీ సాధారణ నిధులు రూ.3 కోట్లతో ఆధునికంగా సిద్ధం చేసే ప్రతిపాదనలు తెరపైకి తీసుకొచ్చారు. కొత్తగా రెండు బర్నింగ్‌ ఫ్లాట్‌ఫారాలు, ఎలక్ట్రికల్‌ క్రిమిటోరియం, పిండ ప్రదానానికి ప్రత్యేక వసతి, మహా శివుడు, సత్యహరిశ్చంద్రుడు విగ్రహాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. అయితే ముందే తగిన ప్రణాళిక ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని పలువురు విమర్శిస్తున్నారు. ఈసారి వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని జోన్‌-6 ఇంజినీరింగ్‌ అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని