గడపగడపలోనూ గగ్గోలే..!

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమం అపహాస్యం పాలవుతోంది.

Updated : 25 Mar 2023 04:55 IST

ముభావంగా సర్పంచులు
బిల్లుల కోసం తప్పని తిప్పలు
కలెక్టరేట్‌(మచిలీపట్నం), న్యూస్‌టుడే

ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన గడప గడపకూ మన ప్రభుత్వ కార్యక్రమం అపహాస్యం పాలవుతోంది. సంక్షేమ పథకాల విషయంలో ప్రజల నిలదీత నుంచి నయానో భయానో తప్పించుకుంటున్న ప్రజాప్రతినిధులు సత్వరం చేయాల్సిన పనుల విషయంలోనూ వైఫల్యం చెందుతున్నారు. కార్యక్రమం పూర్తి చేసిన ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు చేసి అత్యవసర పనులు వెంటనే చేపట్టాలన్న ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలే అవుతున్నాయి. ఇప్పటి వరకూ మంజూరు చేసిన పనుల్లో 70 శాతం మేర ఎటువంటి కదలిక లేకపోగా పూర్తి చేసిన 30 శాతం పనులకు బిల్లులందక నిర్వాహకులు గగ్గోలు పెడుతున్నారు. రమారమి నెలరోజులుగా సీఎఫ్‌ఎంఎస్‌ పనిచేయకపోవడం, బిల్లుల చెల్లింపుల విషయంలో వ్యక్తమవుతున్న అనుమానాలతో పనులు చేపట్టేందుకు  ముందుకు వచ్చే పరిస్థితి కన్పించడంలేదు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు అభివృద్ధికి దూరంగా ఉన్న పంచాయతీల్లో ప్రాధాన్యత ఉన్న పనులు గుర్తించి వాటిని వెంటనే చేసి ప్రజాభిమానం చూరగొనాలన్న లక్ష్యంతో ఆరు నెలల క్రితం గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రత్యేక శ్రద్ధతో అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి శాసనసభ్యుడు, అధికారులతో కలిసి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని గుర్తించిన వ్యక్తిగత, సామాజిక సమస్యలను పరిష్కరించే విధంగా ప్రతి సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున మంజూరుచేశారు. ప్రధానంగా ఈ నిధులతో ఆయా సచివాలయాల పరిధిలో సీసీ రహదారులు, డ్రెయిన్లు, తాగునీటి వసతుల కల్పన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకూ కార్యక్రమం పూర్తయిన గ్రామాల నుంచి గుర్తించిన సమస్యలకు అనుగుణంగా శాసనసభ్యులు సిఫార్సు చేసిన పనులను జిల్లా అధికారులు మంజూరు చేసి చేపట్టే బాధ్యతను శాఖల వారీ అప్పగించారు. కీలకమైన సీసీ రహదారుల నిర్మాణ పనులకు సంబంధించి రూ.13 కోట్లకు పైగా అంచనాలతో కూడిన పనులను పంచాయతీరాజ్‌ శాఖ చేపట్టింది. అవనిగడ్డ సబ్‌ డివిజన్‌కు అత్యధికంగా రూ.5 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో జిల్లాలోని అన్ని సబ్‌ డివిజన్ల పరిధిలో 21 కి.మీ నిడివి గల రహదారులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటికి కేవలం 10 కి.మీ లోపు పనులు కూడా పూర్తికాలేదంటే పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గుడివాడ సబ్‌ డివిజన్‌ పరిధిలో ఇప్పటి వరకూ ఒక్కపని కూడా పూర్తిస్థాయిలో చేపట్టిన దాఖాలు లేవు.

పనులు చేసేందుకు కానరాని ఆసక్తి

పంచాయతీల్లో వివిధ సాధారణ బిల్లులతో పాటు గతంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపులు సక్రమంగా జరగడం లేదు. ఇప్పటికే అప్పులు తెచ్చి పనులు చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు, గుత్తేదారులు బిల్లులు ఇచ్చినా వడ్డీలకు సరిపోయేలా లేవని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా మంజూరైన పనులు పూర్తిచేయాలన్న పట్టుదలతో శాసనసభ్యులు పలువురు సర్పంచులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.


ప్రాధాన్యం ఇవ్వకపోతే ఎలా?

డప గడపడకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన పనులు, ఎంపిక విషయంలో స్థానిక సర్పంచుల అభిప్రాయంతో పనిలేదన్నట్టుగా కొందరు శాసనసభ్యులు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి సర్పంచులుగా అధికారం దక్కించుకున్నాక, అభివృద్ధి పనులు చేసేందుకు ఉపయోగించుకోవాల్సిన ఆర్థిక సంఘ నిధులను ఏకపక్షంగా ప్రభుత్వం విద్యుత్తు బకాయిల పేరుతో దారి మళ్లించిదని, కనీసం సచివాలయాలకు ఇచ్చే రూ.20 లక్షల విషయంలో నైనా తమకు ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని మండలాల పరిధిలో సర్పంచి సూచించిన పనులకు కాకుండా వేరే పనులకు మంజూరు ఇవ్వడం పట్ల వారిలో విముఖత వ్యక్తం అవుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని